జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం 353సి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని భూపాలపల్లి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాటారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వరికోల్ పల్లి గ్రామానికి చెందిన పది మంది ఆటోలో మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు వెళ్తుండగా కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లి వస్తున్న హైదరాబాద్‌కు చెందిన కారు ఆటోను వేగంగా
ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జు కాగా ఆటోలో ప్రయాణిస్తున్న వరికోల్‌పల్లి గ్రామానికి చెందిన రజిత (32), విష్ణు (20) ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా నర్శింహా, అజిత్, వివన్, శాన్విత, విశ్రుత్, సంధ్య, శోభ, మోక్షితలకు గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కారు డ్రైవర్ చంద్రకాంత్, విశ్వనాథ్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులు కారులో కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో భూపాలపల్లి కాటారం మధ్య అటవీ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.