జూరాల ప్రాజెక్టుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూ వీలర్ నడుపుతున్న వ్యక్తికి గాయాలు కాగా, అతని వెనుక కూర్చున్న యువకుడు అమాంతం ఎగిరి కృష్ణానదిలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జూరాల ప్రాజెక్టుపై చోటుచేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారమణమంటూ సిసి పుటేజీ వీడియోలను పరిశీలిస్తే తెలుస్తోంది. ధరూర్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరగడంతో జలకళను సంతరించుకుంది. డ్యామ్ గేట్లను తెరిచి దిగువకు నీరు విడుదల చేయడంతో డ్యామ్ అందాలను చూడటానికి పర్యాటకులు తరలివచ్చారు. ఈ క్రమంలో గద్వాల జిల్లా, మానవపాడు మండలం, బూడిదపాడు(ఎ) గ్రామానికి చెందిన జానకి రాము, మహేష్ ఆదివారం సెలవుదినం కావడంతో జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.
సందర్శన అనంతరం బైక్‌పై గద్వాలకు తిరిగి వస్తున్నారు. అదే సమయంలో అమరచింత వైపు వెళ్తున్న కారు డ్రైవర్ కారును నిర్లక్షంతో నడపడంతో జూరాల ప్రాజెక్టు 48 గేట్ వద్ద వారి బైక్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న జానకి రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. అతని వెనుక కూర్చున్న మహేష్ ఎగిరి కృష్ణానదిలో పడి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేసి, సోమవారం ఉదయం జాలర్ల సాయంతో నదిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా మహేష్ ఆచూకీ లభించలేదు. జూరాల ప్రాజెక్టు 48 గేట్ ముందు వరద ప్రవాహం లేకున్న లోతుగా ఉండడంతో కింద పడిన యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.