మబ్బు తునక వాన మొలక
ఉదయాన్ని పంచుకున్నాయ్
నీ గుండ్రటి కళ్ళల్లో
రహదారులు మెరుస్తున్నాయ్
ఏవో వాన చినుకుల చీపిరి పుల్లలు
నేల నేలంతా కడిగి
చిత్తడి ముగ్గులు వేశాయి
మత్తెక్కిన నా పేజీల్లో రహస్యాలు
గోల చేస్తున్నాయి
రఘు
ఇలాంటి కవితొకటి రాసినప్పుడు వాన మీద మూర్ఛనలు పోని కవులెవరుంటారనిపిస్తుంది. వానతో మన ప్రాపంచిక లోకాలు మెత్తపడతాయి. ప్రాణాలు పంచవటి చుట్టూ తిరిగే కుందేళ్ళలా శుభ్రపడతాయి. వానను అందుకే దేవతలా చూడటం కద్దు.
పర్జన్యం వర్ష వర్షతి విద్యుతః స్తనయంతి చ
సస్యావాని భూమిర్ మధునా చ వర్షతి
ఋగ్వేదం
పర్జన్యుడు వానలు కురిపిస్తున్నాడు. తన వల్లే
ఈ మెరుపులు, మధురమైన పంట భూములు.
మనం పర్జన్యుడు/వరుణుడు (ఇద్దరూ ఒక టి కాదు) అని పిలుచుకొనే వాన దేవుళ్ళను గ్రీకు లు జ్యుస్ అనో, హైడెస్ అనో పిలుస్తారు. వాళ్ళ స్తోత్రాలేవో వాళ్ళు చేసుకుంటారు. మనలాగే వన దేవతలకు మొక్కుతారు. మన విషయానికి వస్తే విడవబడ్డ ప్రాణాలు మొదట ఆకాశ దేశాన్ని చేరతాయని, అక్కడ మబ్బుల్లా మారి వర్షాలై నేల మీద గింజలౌతాయని, వీర్యాలై వంశాలు నిలబెడతాయని ఉపనిషత్తులు పునర్జన్మ నేపథ్యాన్ని చెబుతాయి. కవులకు కేవలం వస్తువులయ్యే మబ్బులు తతిమ్మా జనానికి దేవతలు. దాని కోసమే బోనాలెత్తుతారు లేదా బలులిచ్చి ప్రసన్నం చేసుకుంటారు. నాగరికత నానా దేశాల్లో నానా రకాలు గా స్థిరపడి వర్షం అనేది విస్మరించే సంగతి కాదని నొక్కి చెబుతుంది. చిన్నప్పుడు కాగితం పడవలతో ఆడుకున్న వానాకాలం గుర్తుకొస్తుంది. వాన మన ప్రాణ నాడి కనుక కాలాలు మారి నా వర్షాల మీద కవిత్వం మాత్రం ఆగలేదు. వాన కురిసే సెలవు పూట కిటికీలో తలొంచి చూడటం, మెరుపుల్ని జరీ అంచు ఉత్తరీయాలతో పోల్చటం నా అలవాటు.
కశాభిరివ హైమీభిర్విద్యుద్భిరివ
తాడితమ్/అంతఃస్తనిత నిర్ఘోషం
సవేదనమివాంబరమ్
కిష్కింధ కాండ 28వ సర్గ – 11వ శ్లోకం
మెరుపులని పిలుచుకొనే బంగారు కొరడాలు ఆకాశాన్ని కొడుతున్నప్పుడు లోపలి బాధను
వెళ్ళబోసుకుంటున్నట్టున్నాయి
మేఘాల గర్జనలు
- రఘు