Friday, September 12, 2025

పట్టపగలే భారీ దారి దోపిడీ

- Advertisement -
- Advertisement -

కారులో డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తులను మరో కారులో అడ్డగించి, భారీ దోపిడీకి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సంచలనం సృష్టించింది. పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రూ.40 లక్షలను వికారాబాద్‌లోని తమ కస్టమర్ నుంచి తీసుకుని రావాల్సిందిగా తన వద్ద పని చేసే ఇద్దరు వ్యక్తులను అక్కడికి పంపాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వికారాబాద్ నుంచి రూ.40 లక్షల డబ్బులు తీసుకొని సాయిబాబా, మణి అనే ఇద్దరు వ్యక్తులు కారులో నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటల సమయంలో శంకరపల్లి మండల పరిధిలోని హుస్సేన్ పూర్ గ్రామ శివారులో వారిని వెనుక నుంచి నలుగురు వ్యక్తులు మరో కారులో అనుసరిస్తూ వచ్చారు.

హుస్సేన్‌పూర్ గ్రామ శివారులో నిర్మానుషమైన ప్రాంతంలో ఆ వాహనాన్ని అడ్డగించిన దుండగులు దోపిడీకి పాల్పడారు. ముగ్గురు వ్యక్తులు ముఖాలకు మాస్క్‌లు ధరించి, కారు వద్దకు వచ్చి డ్రైవర్ కళ్ళలో కారం చెల్లి వెనుక సీటులో కూర్చున్న సాయిబాబా అనే వ్యక్తిపై దాడి చేసి, రాయితో అద్దం పగులగొట్టారు. కారులో ఉన్న ఇద్దర్నీ గాయపరిచి అందులోని రూ. 40 లక్షలు గల బ్యాగును తీసుకొని పరారయ్యారు. అతి వేగంగా కారులో పారిపోతున్న క్రమంలో నాలుగు కిలోమీటర్లు దాటిన తర్వాత కొత్తపల్లి గ్రామ శివారులో దుండగుల కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టుకు ఢీకొట్టి బోల్తా పడింది. వెంటనే వారు బయటకు వచ్చి కారును అక్కడే వదిలి డబ్బు తీసుకొని పారిపోయారు. కారు బోల్తా పడిన శబ్దం రావడంతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ప్రజలు సంఘటనా స్థలంలో గుమిగూడారు. దీనితో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంకర్‌పల్లి పోలీసులు, నార్సింగ్ ఏసిపి రమణ గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

విచారణలో భాగంగా క్లూస్ టైమ్ ఫింగర్ ప్రింట్స్, డాగ్స్ స్క్వేర్ సహాయంతో సాక్ష్యాధారాలు సేకరించారు. సిసిఎస్, ఎస్‌ఒటి బృందాల సహాయంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. బోల్తా పడిన స్థలాన్ని పరిశీలించగా అందులో నిందులకు సంబంధించిన కొన్ని వస్తువులు, కొంత నగదును గుర్తించారు. దుండగులు బాధితులను వికారాబాద్ నుంచి పథకం ప్రకారం వెంబడించినట్లుగా అర్థమవుతోంది. కాగా, దుండగులకు సంబంధించి పలుచోట్ల సిసి కెమెరాలలో దృశ్యాలు రికార్డయ్యాయని, త్వరలో నిందితులను పట్టుకుంటామని శంకరపల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Also Read: చెరువుల్లోకి చేప పిల్లలు రెడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News