చైనా మారథాన్‌లో మనిషికి రోబో సవాలు
కనువిందుగా కిలోమీటర్ల పరుగుపందెం
రేపటి హైటెక్ నమూనా చూపిన డ్రాగన్
బీజింగ్ : చైనాలో ఆదివారం ఆటవిడుపు జరిగింది. స్థానికంగా అధికారులు నిర్వహించిన ఓ పరుగుపందెంలో మర మనుష్యులు (రోబోలు) జీవమున్న మనుష్యులకు సవాలు విసిరాయి. మీతో దేనిలోనూ తీసిపోయేది లేదు. పైగా మిమ్మల్నే మించిపోతామని ఈ హ్యుమానాయిడ్ రోబోలు గట్టి సవాలు విసిరాయి. దీనితో అధికారులే కాకుండా పోటీలో పాల్గొన్న జనం కూడా కంగుతింది. ఔరా? మర మమ్మల్నే మించి పోతావా? అని దిక్కులు చూసింది.
చైనా రాజధానిలో హాఫ్‌మారథాన్ నిర్వహించిన దశలో ఈ ఘట్టం చోటుచేసుకుంది. రెండు కాళ్ల రోబోలు వేలాదిగా తరలివచ్చాయి. పలు రకాల గెటప్‌లు , సైజ్‌లతో ఆకట్టుకున్నాయి. ఇవి చైనా సాంకేతిక ప్రతిభకు అద్దం పట్టాయి. 21.1 కిలోమీటర్లు అంటే దాదాపు 13.1 మైళ్ల దూరం నడక పరుగు పోటీ దశలో మనుష్యులతో పాటు వీరి ఉత్సాహం దండుగా సాగింది. మానవ ఛోధకాలు, ఆపరేటర్లు, ఇంజనీర్లు సాయంతో ఈ విచిత్ర విన్యాసం సాగింది. ప్రపంచానికి తానేమిటో చూపాలనే తపన దండిగా ఉన్న చైనా ఇప్పుడు ఈ తొలి విచిత్ర పోటీ నిర్వహించింది.
డ్రాగన్‌కు సరిలేరు వేరెవ్వరు అన్పించుకుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఏకంగా మనుష్యులు, మర మనుష్యులను వేరు చేసే డివైడర్‌ను ఏర్పాటు చేశారు. ఇక మనిషి ఈ పోటీలో నిబంధనలను పాటిస్తూ ముందుకు సాగాడు . ఇక మర మనుష్యులు ఈ పోటీలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన బ్యాటరీ ఛార్జింగ్ స్థలాల వద్ద కొద్ది సేపు నిలిచి ముందుకు సాగాయి. ఇక ప్రాణంలేని ఈ మర బొమ్మలు, ఆలోచన శక్తి యుక్తి , సమయస్ఫూర్తి ఉండే మానవ బృందాలు ఈ పోటీని క్రికెట్ , ఫుట్‌బాల్ కన్నా మిన్నగా ఆసక్తితో ఆస్వాదించాయి. ఎవరికి వారే వహ్వా అన్పించుకుంటూ ముందుగా సాగాయి. విజేతలను ఖరారు చేశారు.చైనాలోని ప్రఖ్యాత రోబో కంపెనీ స్కై ప్రాజెక్టు అల్ట్రా రోబో ( దీనినే టియిన్ కంగ్ అల్ట్రా అని వ్యవహరిస్తారు) ఈ పోటీలో మానవేతర ప్రాతినిధ్యం పోటీలో విజేతగా నిలిచింది. పరుగు పందెంలో తుది లక్ష్మణ రేఖను 2 గంటల 40 నిమిషాల 42 సెకెండ్లలో దాటేసింది. ఇక ఈ క్రీడా పోటీలో పాల్గొన్న వారికి పలు రకాల ప్రోత్సాహాకాలు అందించారు. అత్యంత వినూత్న రూపం, ఉత్తమ నడక తీరు, హావ భావాలు వంటి కేటగిరిలలో కూడా కొన్నింటికి లేదా కొందరికి అవార్డులు దక్కాయి.