ముంబై: టీం ఇండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో కనిపించి చాలాకాలమే అయింది. చివరిగా అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అయితే ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కి ముందు టెస్ట్‌ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్‌ను సాధించడమే రోహిత్ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. అయితే తాజాగా ఓ విషయంలో రోహిత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అదేంటంటే.. రోహిత్ సోమవారం (సెప్టెంబర్ 8)న ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో కనిపించాడు. దీంతో రోహిత్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లి ఉంటాడా అని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.
రోహిత్ (Rohit Sharma) ఆస్పత్రిలోకి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు రోహిత్‌కు ఆరోగ్యం బాగలేదని కామెంట్ చేస్తుంటే.. మరికొందరేమో అతని సన్నిహితులను చూసేందుకు ఆస్పత్రికి వచ్చి ఉంటాడని అంటున్నారు. అయితే ఎప్పుడు సరదాగా ఉంటే రోహిత్.. ఈ వీడియోలో కాస్త భిన్నంగా కనిపించాడు. మీడియాకు సమాధానం ఇవ్వకుండా హడావుడిగా ఆస్పత్రిలోకి వెళ్లిపోయాడు. అయితే రోహిత్ ఇటీవలే బిసిసిఐ నిర్వహించిన ‘యో-యో(బ్రోంకో)’ టెస్ట్‌ను పాస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతని ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
రోహిత్ త్వరలోనే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. రోహిత్‌తో పాటు టెస్ట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌తోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వీరిద్దరికీ ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ సిరీస్‌తోనే వీరిద్దరి వన్డే ప్రపంచకప్ భవితవ్యం తేలనుంది.
Also Read : ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నామినేటైన సిరాజ్