మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ టెస్టు( world test) క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రూట్ పరుగుల వరద పారించాడు. వరుస సెంచరీలతో సిరీస్‌లో పెను ప్రకంపనలు సృష్టించాడు. సమకాలిన క్రికెట్‌లో రూట్ ఎదురులైన బ్యాటర్‌గా మారాడు. అత్యంత నిలకడైన బ్యాటింగ్‌తో టెస్టు క్రికెట్‌లోని పలు రికార్డులను బద్దలు కొడుతున్నాడు. సొంత గడ్డపై జరిగిన ఐదు మ్యాచ్‌ల అండర్సన్‌టెండూల్కర్ సిరీస్‌లో జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తర్వాత సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ రూటే కావడం గమనార్హం. ఐదు టెస్టుల్లో 9 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్ 67.12 సగటుతో 537 పరుగులు చేశాడు.
ఇందులో మూడు సెంచరీలు, ఓ అర్ధ సెంచరీ ఉంది. కాగా, కొన్నేళ్లుగా ప్రపంచ టెస్టు క్రికెట్‌లో రూట్ ఎదురులేని బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. సిరీస్ ఏదైనా (Any series) పరుగుల వరద పారించడం అనవాయితీగా మార్చుకున్నాడు. పాకిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, విండీస్, భారత్ తదితర జట్లతో జరిగిన సిరీస్‌లలో రూట్ అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. 34 ఏళ్ల రూట్ ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో రూట్ ఈ ఘనత అందుకున్నాడు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్, సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్, భారత సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌లను వెనక్కినెట్టి టెస్టుల్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం రూట్ 158 టెస్టుల్లో 13543 పరుగులు సాధించాడు. ఇందులో 39 సెంచరీలు, మరో 66 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూర్ 200 టెస్టుల్లో 15921 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ తన టెస్టు క్రికెట్ కెరీర్‌లో 100 సెంచరీలు, 50 అర్ధ సెంచరీలు సాధించాడు. కాగా, సచిన్ రికార్డును అందుకోవాలంటే రూట్ మరో 2378 పరుగులు చేస్తే సరిపోతోంది.
అసాధ్యమేమీ కాదు..
మరోవైపు ప్రస్తుతం ప్రపంచ టెస్టు క్రికెట్‌లో సచిన్ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ రూట్‌కు మాత్రమే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతకాలంగా రూట్ బ్యాటింగ్‌ను గమనిస్తే రానున్న రెండు, మూడేళ్లలో మాస్టర్ బ్లాస్టర్ పేరిట ఉన్న పలు టెస్టు రికార్టును తిరగరాయడం ఖాయమనే చెప్పాలి. టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు ఎక్కువ శతకాలు, అర్ధ శతకాల రికార్డును రూట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో 12 సెంచరీలు సాధిస్తే సచిన్ రికార్డును అందుకుంటాడు. ఇక రెండు అర్ధ సెంచరీలు సాధిస్తే సచిన్‌ను దాటిపోతాడు. మరో 2379 పరుగులు చేస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నయా చరిత్ర సృష్టిస్తాడు. ఇలాంటి స్థితిలో సచిన్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని చెప్పక తప్పదు.