మధ్యప్రదేశ్ లో అవినీతి పరాకాష్ట వంటి ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లాలో సకండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గోడకు నాలుగు లీటర్ల పెయింట్ ను 168 మంది కార్మికులు, 65 మంది మేస్త్రీలు వేశారు. అందుకు అయిన ఖర్చు రూ.1.07 లక్షలు.. ఆశ్చర్యంగా ఉంది కదూ. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. నిపానియా గ్రామంలోని మరో పాఠశాలకు 20 లీటర్ల పెయింట్ వేయడానికి ఏకంగా రూ. 2.3 లక్షలు విత్ డ్రా చేసుకున్నారు. ఈ బిల్లులను సోషల్ మీడియాలో ప్రముఖంగా చూపారు. నిపానియాలో 10 కిటికీలు, నాలుగు తలుపులకు రంగులు వేయడానికి 150 మంది మేస్త్రీలు, 275 మంది కార్మికలు కష్టపడ్డారట.
ఈ ప్రతిభ పాఠశాల గోడల మీద కాదు, కాగితాలలో ప్రత్యక్షమైంది. ఈ పెయింట్ వర్క్ ను నిర్మాణ సంస్థ సుధాకర్ కన్ స్ట్రక్షన్స్ నిర్వహించింది. 2025 మే 5 న ఈ బిల్లును రూపొందించారు. దీనిని అప్పటికే నెల్లాళ్ల ముందు అంటే ఏప్రిల్ 4నే నిపానియా పాఠశాల ప్రిన్సిపాల్ ధ్రువీకరించడం మరో విచిత్రం.అలాంటి బిల్లులతో పాటు పెయింట్ వేసిన గోడ ఫోటో, పెయింట్ వెయక ముందు గోడ పరిస్థితి తెలిపే ఫోటోలవు జతచేయాలి. విచిత్రం ఏమిటంటే, ఎలాంటి ఫోటోలను జత చేయకుండానే ఈ బిల్లులను ఆమోదించేశారు. ఈ బిల్లుల విషయంలో స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి పూల్ సింగ్ రెండు పాఠశాలల బిల్లులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, వాటిపై దర్యాప్తు చేస్తున్నామని, వాస్తవాలు వెలికి వచ్చిన తర్వాత బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు.