ఢిల్లీ లోని ఎర్రకోటలో భారీ దొంగతనం జరగడం కలకలం రేపింది. ఇటీవల ఎర్రకోటలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో రూ. కోటి విలువ గల రెండు కలశాలు చోరీకి గురైనట్టు అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 3న ఉదయం ఎర్రకోటలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అనంతరం పూజ కోసం తాను తీసుకు వచ్చిన 760 గ్రాముల బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో చిన్న బంగారు కలశం కనిపించలేదని వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ ఎర్రకోట నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. పూజా కార్యక్రమానికి ప్రముఖులు హాజరవ్వడంతో తాము పక్కకు వెళ్లామని, అంతలోనే ఈ దొంగతనం జరిగిందని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజాసామగ్రి ఉన్న గదిలోకి వెళ్లి రెండు కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అనంతరం అతడు అక్కడి నుంచి బయటకు జారుకున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే పలు ఆలయాల్లో దొంగతనానికి యత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. కలశాలను దొంగలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.