మన తెలంగాణ/హైదరాబాద్/ఎల్‌బినగర్: ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట మోసానికి పాల్పడి, కోట్లు కొల్లగొట్టిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీకాంత్‌పై ఎల్‌బినగర్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఫ్రీ లాంచ్ ఆఫర్లు పేరుతో ప్రాజెక్టులు ప్రకటించి కోట్లలో డబ్బులు వసూలు చేసి.. వందలాది కుటుంబాలను మోసగించినట్లు ఆరోపణలున్నాయి. ఎల్‌బినగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ నాలుగేళ్ల క్రితమే కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమ ఫ్లాట్స్ ఎక్కడా..? అని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కృతికా ఇన్ఫ్రా తీరుతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌బి నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కృతికా ఇన్‌ఫ్రాకు రాధా భూక్యా ఎండి కాగా, డైరెక్టర్‌గా ధూమవాత్ గోపాల్, సిఇఒగా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలోని తట్టి అన్నారంలో 2 ఎకరాల్లో శేషాద్రి ఓక్ పేరుతో ఎస్+6 అపార్ట్‌మెంట్ నిర్మిస్తామని 2020లో ప్రీ లాంఛ్ సేల్స్ చేసి ఇప్పటివరకు నిర్మాణాలు కూడా చేపట్టలేదు. అలాగే ఉప్పల్‌లో 3 ఎకరాల్లో శేషాద్రి సిల్వర్ ఓక్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తామని హ్యాండిచ్చారు. ప్రీ లాంఛ్ పేరుతో దాదాపు 150 మంది కస్టమర్స్ నుంచి కోట్ల రూపాయలను నిర్వాహకులు వసూలు చేశారు ఏళ్లు గడుస్తున్నా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోగా బయ్యర్ల నుంచి కలెక్ట్ చేసిన డబ్బుని తమకున్న ఇతర వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృతికా ఇన్ ఫ్రా తమని మోసం చేస్తుందని గ్రహించిన బాధితులు తమ డబ్బును తిరిగివ్వమని అడగ్గా మొదట్లో మాయమాటలు చెప్పి తప్పించుకొన్న యాజమాన్యం.. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు దిగుతోందని వాపోతున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు.
మొత్తం మూడు ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి సుమారుగా రూ.30 లక్షల నుంచి 50 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ మోసానికి గురైన సుమారు 40 కుటుంబాలు ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాయి. తాము సంపాదించుకున్న డబ్బు అంతా ఈ ప్రాజెక్టుల్లో పెట్టామని, ఇప్పుడు అది అంతా వృథా అయిపోయిందని వాపోయారు. ఫిర్యాదుల మేరకు ఎల్‌బీ నగర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలోనే కోట్ల రూపాయల మోసం జరిగినట్లు తేలడంతో, ఎండి శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. సంస్థ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో మరికొంతమంది ప్రమోటర్లు, మధ్యవర్తులు కూడా ఉన్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది.
Also Read: గ్రూప్-1 తీర్పుపై డివిజన్ బెంచ్‌కు టిజిపిఎస్‌సి అప్పీల్