రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో వివిధ చెల్లింపుల కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలు రూ.11 కోట్లు విడుదల చేశామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఈ ఏడాది జూలై, ఆగస్టు- నెలలకు గాను టీజీడబ్ల్యుఆర్‌ఈఐ సొసైటీకి చెందిన కాంట్రాక్టు, ఔట్‌సోర్స్, పార్ట్ టైైమ్ సిబ్బందికి, సబ్జెక్ట్ అసోసియేట్స్, హెడ్ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బందికి, అలాగే స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలకు సంబంధించి రెమ్యునరేషన్, సర్వీస్ ఛార్జీలు కింద రూ.11.53 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ,
ఎస్టీ వెల్ఫేర్ ఉద్యోగులను విస్మరించిందని విమర్శించారు. ఉద్యోగుల, విద్యార్థుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్ళగానే ఆయన నిధులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. 2025 ఏప్రిల్- నుంచి ఆగస్టు కాలానికి సబ్జెక్ట్ అసోసియేట్స్, సీనియర్ ఫ్యాకల్టీ, గేమ్స్ కోచ్‌ల జీతాల కోసం రూ.2.38 కోట్లు విడుదల చేశామని తెలిపారు. జూలై, ఆగస్టు- 2025 నెలలకు గాను ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి రూ.0.22 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. జూలై- 2025 వరకు స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలకు రూ.1.04 కోట్లు సర్వీస్ ఛార్జీలుగా విడుదల చేశామని వివరించారు. జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించిన రూ.9 కోట్లను విడుదల చేశామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఆధునీకరణ
రాష్ట్ర వ్యాప్తంగా 18 నియోజకవర్గాలల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ప్రారంభమయ్యాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. గత ప్రభుత్వానికి ప్రగతి భవన్ కట్టుకోవడానికి నిధులు ఉన్నాయి గానీ ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించలేదని అన్నారు. తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించటం కాకుండా గ్రీన్ ఛాలెంజ్ ద్వారా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. పాఠశాలలు, విద్యార్థుల పట్ల ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదని, సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఎప్పుడు భోజనం చేయలేదని అన్నారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ శాఖలకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం
ఎస్సీ, ఎస్టీ శాఖలకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు కేటాయించాలని, స్కాలర్‌షిప్‌ల్లో కేంద్రం వాటా పెంచాలని కేంద్రాన్ని కోరామని మంత్రి పేర్కొన్నారు. చదువుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అశోక్ నగర్ ప్రాంతంలో నూతన ఎస్సీ హాస్టల్ ప్రారంభించాలనే ఆలోచన తమ ప్రభుత్వం చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని సిఎస్ఆర్ ఫండ్ తో సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వివరించారు. గ్రూప్ 1 విషయంలో బట్ట కాల్చి మీద వేయడం కాదని,.ఆధారాలు ఉంటే నిరూపించి బయటపెట్టాలని హితవు పలికారు. అనవసరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. షేక్ పేట, ధర్మపురిల్లో రూ.24 లక్షలతో మోడ్రన్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్నామని చెప్పారు.