తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని,గ్రూప్ 1 ఉద్యోగం కోసం కాంగ్రెస్ మంత్రులు అభ్యర్థులతో బేరసారాలకు పాల్పడ్డారని, ఒక్కో ఉద్యోగానికి మూడు కోట్లు అడిగారని, ఇది అతిపెద్ద కుంభకోణం అని బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రైతుల కడుపు నింపే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు,వేలాది మంది నిరుద్యోగుల పొట్ట కొట్టిన గ్రూప్ 1 కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేసును సిబిఐకి అప్పగించాలన్నారు. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్, మూల్యాంకనం రద్దు చేసి, పునర్ మూల్యాంకనం చేయాలని, లేదా తిరిగి పరీక్ష నిర్వహించాలని హై కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బిఆర్‌ఎస్ నేతలు పబ్లిక్ సర్వీస్ కమీషన్ సెక్రటరీని కలిసి వినతి పత్రం అందచేశారు. కమీషన్ చైర్మెన్ ముందు అపాయింట్మెంట్ ఇచ్చి తాము వచ్చే లోపే పారిపోయారని విమర్శించారు.
Also Read: ఓడినా .. నైతిక విజయం మాదే:ఎంపి మల్లు రవి
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్ష రద్దు కావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డేనన్నారు. సోనియా గాంధీ కళ్లల్లో ఆనందం చూడడం కోసం,కాంగ్రెస్ మంత్రులకు న్యాయం చేయడం కోసమే హడావుడిగా అర్హత లేని వ్యక్తులతో మూల్యాంకనం చేయించి,తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. జివో నెం 29 సామాజిక న్యాయానికి వ్యతిరేకం,రాజ్యాంగ విరుద్ధమని చెప్పినా వినకుండా పేద వర్గాల అభ్యర్థులకు అన్యాయం చేసేలా అనాలోచితంగా వ్యవహరించారన్నారు. గత కేసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేశారు తప్ప,కొత్తగా కేవలం 6 వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 563 పోస్టులు కూడా సమర్థవంతంగా నిర్వహించక పోవడంతో కమీషన్ చైర్మెన్, సభ్యుల అసమర్ధత బయటపడిందన్నారు. పరీక్షలు నిర్వహించడం చేతకాని కమీషన్ చైర్మెన్, సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అర్హులైన,మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని చూశారని విమర్శించారు. అందుకోసం ఇష్టం వచ్చినట్టు పరీక్ష కేంద్రాలను రూల్స్ కి విరుద్ధంగా ఏర్పాటు చేశారని తెలిపారు. మూల్యాంకనం కూడా తమ పార్టీ నాయకులకు సంబంధించిన అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా చేశారన్నారు. అందుకే గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసి,వెంటనే హై కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష తిరిగి నిర్వహించాలన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బిఆర్‌ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాకేష్ రెడ్డి ,తుంగ బాలు,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.