మనతెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే అన్నట్టుగా సిఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బిఆర్‌ఎస్ కీలక నేతలతో పాటు.. తన మంత్రివర్గ సభ్యుల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిఎంకు కేంద్రంలోని బిజెపి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ఎఐసిసి సభ్యుల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతోందని అన్నారు.
పారదర్శకత, చట్టం ప్రకారమే వ్యవహరిస్తున్నామని సిఎం చెబుతున్నారని, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారో.. సీల్డ్ కవర్‌లో పెట్టి హైకోర్టులో సమర్పించాలని డిమాండ్ చేశారు. టెలీగ్రాఫ్ చట్టం ప్రకారం ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో మానిటర్ చేసేందుకు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, హైకోర్టు న్యాయమూర్తి, సంబంధిత అధికారులతో కమిటీ వేయాలన్నారు. సిఎం రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని త్వరలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.