మంగళూరు: కర్ణాటక-కేరళ సరిహద్దులోని తలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకకు చెందిన ఆర్టీసి బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ ఆటోను ఢీకొట్టి బస్ స్టాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు.. మంగళూరు నుండి కాసరగోడ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు. వారిలో ఐదుగురు పెద్దలు, ఒక మైనర్ బాలిక ఉంది. నలుగురు పెద్దలు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బస్ స్టాప్‌లో వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.