మాస్కో : ప్రాణాంతక క్యాన్సర్ నివారక మందు ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్‌ను రష్యా శాస్త్రజ్ఞులు రూపొందించారు. ప్రయోగశాల పరీక్షలకు దీనిని సిద్ధం చేశారు. ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నాలజీ ఆధారంగా ఈ టీకాను తయారు చేసినట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు. కొవిడ్ 19 టీకాను కూడా ఈ పద్ధతిలోనే కరోనా దశలో విజయవంతంగా రూపొందించారు. మనిషి శరీరంలో క్యాన్సర్ కణాలను దెబ్బతీసేందుకు వీలుగా ఈ టీకా ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. మనిషి కణజాలంలోని క్యాన్సర్ కారక కణాలను గుర్తించి, వాటిపై దాడికి ఈ వ్యాక్సిన్ ద్వారా వీలేర్పడుతుంది. కణజాలాల్లోని శక్తివంతమైన రోగనిరోధక శక్తిని ప్రాతిపదికగా చేసుకుని రూపొందించే శాస్త్రీయ పద్థతిని ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నాలజీగా వ్యహరిస్తారు. ప్రస్తుతానికి క్లినికల్ టెస్టులకు దీనిని పంపించారు.
అక్కడ కూడా దీని పనితీరు బాగా ఉంటే, దీనిని రష్యా ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంది.క్యాన్సర్ టీకా గురించి రష్యాకు చెందిన ఔషధ అధికారిక ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ (ఎఫ్‌ఎంబిఎ) అధికార ప్రకటన వెలువరించింది. సంవత్సరాల తరబడి సాగిన పరిశోధనల తరువాత ఈ టీకాను రూపొందించినట్లు సంస్థ డైరెక్టర్ వెరోనిక స్కదర్‌త్సోవ తెలిపారు. ట్రయల్స్‌లో సంతృప్తికర ఫలితాలు వచ్చాయని వివరించారు. ప్రత్యేకించి క్యాన్సర్ కణాలను లక్షంగా చేసుకునే ఈ టీకా పనిచేస్తుంది. క్రమపద్ధతిలో ఈ టీకాను అన్ని రకాల క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల చికిత్సకు వాడేందుకు వీలుంటుంది.