యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నా, రష్యా మాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యక్ష చర్చలకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల అధ్యక్షులతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడిన నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. “ యుద్ధంలో మేం చాలా కోల్పోయాం. దీన్ని ముగించడం మాకు చాలా ముఖ్యం. అందుకు మేం సిద్ధం. కానీ రష్యా అందుకు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. మేము వారిని నమ్మం. ముందుగా కాల్పుల విరమణకు వారు అంగీకరించాలి. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలి. ఇదే మేం కోరుతున్నాం.
ఎలాంటి షరతులు లేకుండా ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు ” అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా ఈ హత్యలు ఆపేందుకు సిద్ధంగా లేకుంటే దానిపై ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. మాస్కోపై ఒత్తిడి తెచ్చి కీవ్‌లోశాంతి నెలకొల్పాలన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్ దాదాపు 2 గంటల పైనే ఫోన్‌లో మాట్లాడుకున్నారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.