11 ఏళ్ల కిందట ప్రమాదానికి గురైన మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కూల్చింది రష్యానేనట. ఐరోపాకు చెందిన హ్యూమన్ రైట్స్ కోర్టు (స్ట్రాస్‌బర్గ్‌కోర్టు) తాజాగా ఈ తీర్పు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగానే విమానంపై దాడి చేశారని, బహుశా అది సైనిక విమానంగా భావించి ఉండొచ్చని తన తీర్పులో పేర్కొంది. ఈ విపత్తులో తన ప్రమేయాన్ని అంగీకరించడానికి రష్యా నిరాకరించడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం కిందికే వస్తుందని పేర్కొంది. విచారణ సరిగా నిర్వహించడంలో ఆ దేశ వైఫల్యం మృతుల కుటుంబాల బాధను మరింత తీవ్ర ం చేసిందని వ్యాఖ్యానించింది. ఈ సంఘటనకు మాస్కోదే బాధ్యత అని గతంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఏవియేషన్ ఏజెన్సీ గుర్తించింది.
2014 జులై 17న మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం 298 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు వెళ్తుండగా ఉక్రెయిన్ గగనతలంలో క్షిపణి దాడి జరిగింది.రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుమతితో ఆ దేశం అందించిన క్షిపణులతోనే ఉక్రెయిన్ వేర్పాటువాదులు ఈ దాడికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఇందులో పుతిన్ జోక్యం ఉందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అంతర్జాతీయ దర్యాప్తు బృందం పేర్కొంది. ఈ నేపథ్యం లోనే తాజా తీర్పు వచ్చింది. అంతర్జాతీయ దర్యాప్తు బృందంలో రష్యా భాగస్వామిగా లేదు. అందువల్ల ఆ దర్యాప్తు ఫలితాలను తాము అంగీకరించలేమని అప్పుడు మాస్కో ఆ నివేదికను ఖండించింది. తాజాగా కూడా తీర్పును రష్యా తోసిపుచ్చగా ఉక్రెయిన్ గొప్ప విజయం అని అభివర్ణించడం గమనార్హం.
ఇదిలా ఉండగా, గతేడాది డిసెంబర్‌లో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె28243 విమానం … దేశ రాజధాని బాకు నుంచి రష్యా లోని గ్రోజ్నికి వెళ్తూ కజఖిస్థాన్‌లో ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ సంఘటనలో 38 మంది మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు రష్యాయే కారణమంటూ ఆరోపణలు రాగా, పుతిన్ క్షమాపణలు చెప్పారు. కానీ ప్రమాదానికి తామే కారణమన్న ఆరోపణలను ఆయన అంగీకరించలేదు. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే ఆ విమానం ప్రమాదానికి గురైందని అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ ఆరోపించారు.