Wednesday, April 30, 2025

మాయదారి మధ్యవర్తిత్వం

- Advertisement -
- Advertisement -

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న చందంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు నడుం బిగించిన అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలతో పీటముడి మరింత బిగుసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. క్రిమియా విషయంలో రష్యాకు అనుకూలంగా ఆయన చేస్తున్న ప్రకటనలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతరం అధికారికంగా ఉక్రెయిన్ కు దఖలుపడిన క్రిమియా.. రష్యాకే చెందుతుందంటూ ట్రంప్ మహాశయుడు ప్రకటించడం విడ్డూరం కాక మరేమిటి? రష్యా దౌర్జన్యంగా క్రిమియాను ఆక్రమించిందన్న సంగతి ఆయనకు తెలియదనుకోవాలా లేక అంతర్జాతీయ సమాజం ఇప్పటికీ క్రిమియాను ఉక్రెయిన్ లో అంతర్భాగంగా పరిగణిస్తోందన్న వాస్తవాన్ని ఆయన విస్మరించారనుకోవాలా? నయానో భయానో యుద్ధాన్ని విరమింపజేసి, ఆ ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుడు అందుకు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల పట్ల ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి.

కయ్యానికి కాలుదువ్విన రష్యా అధినేత పుతిన్ తరపున వకాల్తా తీసుకుంటూ, ఉక్రెయిన్ అధ్యక్షుడిపై చీటికీ మాటికీ ఒంటికాలిపై లేస్తున్న ట్రంప్ తీరు గర్హనీయం. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడితో భేటీ అయిన ట్రంప్… క్రిమియాను రష్యాకు అప్పగించేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందంటూ విలేఖరుల ఎదుట ఏకపక్షంగా ప్రకటించడం ఆయన తెంపరితనానికి నిదర్శనం. తమ భూభాగాన్ని రష్యా పరం చేయడం అంత తేలిక కాదని, రాజ్యాంగంలో మార్పులు చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ఓటింగ్ నిర్వహించవలసి ఉంటుందని ఉక్రెయిన్ చెబుతున్న మాటల్ని ఆయన ఖాతరు చేయకపోగా, క్రిమియాలో అధికశాతం ప్రజలు రష్యన్ భాషనే మాట్లాడతారనీ, ఆ ప్రాంతంలో రష్యా ఎంతోకాలంగా తమ సబ్ మెరైన్లను మోహరించినందున అది రష్యాకే చెందుతుందనీ చేస్తున్న వితండవాదం నివ్వెరగొలుపుతోంది. మధ్యవర్తిగా ఇరు దేశాలకు సామరస్య పరిష్కారాన్ని చూపవలసిన బాధ్యతను విస్మరించి, ఒక పక్షాన్ని ఇలా భుజానికెత్తుకోవడం సిగ్గుచేటు. రష్యన్ భాషను ఎక్కువమంది మాట్లాడుతున్నంతమాత్రాన దానిపై అధికారం ఆ దేశానికే చెందుతుందని తీర్పు ఇవ్వడం సమంజసమేనా? ప్రజాస్వామ్యయుగంలో దురాక్రమణలు, దౌర్జన్యాలకు తావులేదని ఆయనకు చెప్పేదెవరు? పైపెచ్చు, యుద్ధ విరమణకు తాము రూపొందించిన శాంతి ఒప్పందంలో క్రిమియాను చేర్చి, ఉక్రెయిన్ ను ఒప్పించేందుకు ఆయన సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు.

దక్షిణ ఉక్రెయిన్ లో నల్లసముద్రం వెంబడి ఉన్న క్రిమియా ఓ ద్వీపకల్పం. సముద్రజలాల్లో దేశసరిహద్దుల పరిరక్షణకు క్రిమియా కీలకం కావడంతో రష్యా ఎప్పటినుంచో ఈ ప్రాంతంపై కన్నువేసింది. అందులో భాగంగానే క్రిమియాలో తమ నౌకాదళ స్థావరాల ఏర్పాటుకు సంబంధించి ఉక్రెయిన్ తో గతంలో కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు క్రిమియాలోని కీలకమైన సెవస్తోపోల్ నౌకాశ్రయాన్ని 2042 వరకూ రష్యన్ నౌకాదళం వినియోగించుకునేందుకు ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ ఒప్పందాన్ని 2047 వరకూ పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ నౌకాశ్రయంలో పదిహేనేళ్లుగా రష్యన్ ఆధిపత్యమే కొనసాగుతుండగా, అది చాలదన్నట్లు 2014లో యావత్తు క్రిమియాను ఆక్రమించుకోవడం పుతిన్ దురహంకారానికి నిదర్శనం.

అంతేకాదు, 2022లో ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభించాక, తమ దళాలను ఎక్కువగా క్రిమియాలోనే మోహరించింది. దాంతోపాటు, క్రిమియాను చేజిక్కించుకున్నాక ఇప్పటివరకూ ఎనిమిది లక్షలమంది రష్యన్లు ఆ ప్రాంతానికి వలస రాగా, లక్షకు పైగా ఉక్రేనియన్లు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. క్రిమియాను స్థావరంగా చేసుకుని రష్యా సాగిస్తున్న దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ గత్యంతరం లేని పరిస్థితుల్లో క్రిమియాపై దాడులు చేస్తోంది. రష్యాతో క్రిమియాను అనుసంధానించే కీలకమైన వంతెనను సైతం ఉక్రెయిన్ రెండు దఫాలుగా విచ్ఛిన్నం చేసింది.

అమెరికా ఆధ్వర్యంలో ఒకవైపు శాంతియత్నాలు జరుగుతున్నా, పుతిన్ సంయమనం పాటించకుండా ఉక్రెయిన్ పై దాడులు జరుపుతూనే ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధ విజయానికి 80వ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు యుద్ధ విరమణను పాటిస్తున్నట్లు పుతిన్ ప్రకటించడం కంటితుడుపు చర్య మాత్రమే. ఆ తర్వాత మళ్లీ దాడులు ప్రారంభించరనే గ్యారంటీ ఏమీ లేదు. రష్యా దుందుడుకుతనానికి ముకుతాడు వేయవలసిన ట్రంప్ మహాశయుడు మాత్రం ఉక్రెయిన్ మెడలు ఎలా వంచాలా అన్నదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా దేశాల చరిత్ర తెలియకుండా, అక్కడి సంస్కృతి సాంప్రదాయాల గురించి అధ్యయనం చేయకుండా, ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఫలానా దేశాన్ని స్వాధీనం చేసుకుంటాం, ఫలానా దేశాన్ని నాశనం చేస్తామంటూ వదరుబోతు మాటలు మాట్లాడటం ఆయనకు ఒక అలవాటుగా మారింది. ఒక భూభాగాన్ని ఆక్రమించి దీర్ఘకాలం తమ అధీనంలో ఉంచుకున్నంతమాత్రాన అది ఆ దేశానికే చెందుతుందని తీర్పు చెప్పడానికి తనకున్న అర్హతలేమిటో ట్రంప్ ఆత్మావలోకనం చేసుకోవడం మంచిది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News