Friday, June 6, 2025

విధ్వంసం, జనహననం ఆగేదెన్నడు?

- Advertisement -
- Advertisement -

తుర్కియేలో రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య జరిగిన శాంతి చర్చల్లో యుద్ధ విరమణకు సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించలేదు. కనీసం కాల్పుల విరమణకు సైతం ఇరుదేశాలు అంగీకరించలేదు. దీనికి కారణం ఉక్రెయిన్ యుద్ధోన్మాదమే కారణమని చెప్పక తప్పదు. మాస్కో, కీవ్‌ల మధ్య ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలకు సన్నద్ధమైన సందర్భంలో ఉక్రయిన్ సంయమనం పాటించకుండా ఉక్రోషంతో రష్యాపై వైమానికి దాడులకు తెగబడింది. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయి, ఆ దేశం లోని ఎయిర్ బేస్‌లపై దాడులు చేసి 40కి పైగా రష్యా యుద్ధ విమానాలను ధ్వంసం చేసి, సైనిక శిక్షణా శిబిరంపై విరుచుకుపడింది.

రష్యా ఎయిర్‌బేస్ వ్యవస్థలో సుమారు 30% ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా కూడా ఉక్రెయిన్‌పై వందలాది డ్రోన్లను ప్రయోగించి భారీ నష్టం కలుగచేసింది. ప్రశాంతమైన వాతావరణంలో శాంతి చర్చలు జరగబోయే తరుణంలో ఈ చర్చలకు విఘాతం కలిగిస్తూ ఉక్రెయిన్ ఎవరూ ఊహించని విధంగా రష్యాపై పెను విధ్వంసాన్ని సాగించింది. యుద్ధం వలన ఏర్పడిన రక్తపాతాన్ని, మారణహోమాన్ని వ్యతిరేకిస్తున్న రష్యా ప్రజానీకం పుతిన్‌కు సంఘీభావం తెలుపుతూ ఉక్రెయిన్‌ను చావు దెబ్బ తీయాలని ఎలుగెత్తి చాటడం గమనార్హం. అత్యంత ఆధునిక టెక్నాలజీ గల రష్యా ఉక్రెయిన్ ఆకస్మిక దాడిని పసిగట్టకపోవడం, పదుల సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోవడం ఆశ్చర్యకరం.ఉక్రెయిన్ చర్యకు రష్యా ప్రతీకారం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి. మొదటి నుంచి జెలెన్‌స్కీ మొండి వైఖరిని ప్రదర్శించడ వలనే రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి తలపడింది.

రష్యాకు శత్రుదేశాలైన నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరాలని తపించడం పెద్ద పొరపాటు. ఇది రష్యా సార్వభౌమత్వానికి పెద్డ సవాల్. అందుకే పుతిన్ ఉక్రెయిన్ చర్యను వ్యతిరేకించి ఉక్రెయిన్ పై యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరగడానికి ముందు జెలెన్‌స్కీ రష్యాపై దాడులకు తెగబడడం సముచితం కాదు. అణ్వాయుధాలతో దాడికి సైతం రష్యా సిద్ధంగా ఉంది. అతి పెద్ద అణ్వస్త్ర దేశం రష్యా వద్ద 5 వేలకు పైగా అణ్వాయుధాలు, 1700లకు పైగా క్షిపణులున్నాయి.

ఉక్రెయిన్ కు ఎలాంటి ఆయుధ, ఆర్థిక సహాయం చేయబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఉక్రెయిన్ పతనం తప్పదని, ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో ఇంత భీకరంగా ఉక్రెయిన్ రష్యాపై తిరగబడుతుందని ఎవరూ ఊహించలేదు. అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య కేవలం ఉక్రెయిన్ ఖనిజ సంపదను దోచుకోవడానికి మాత్రమే ఒప్పందం కుదిరింది. యుద్ధానంతరం ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి అమెరికా సహకరిస్తుందని ఆ ఒప్పందంలో ఉంది. ఉక్రెయిన్ భద్రత విషయంలో అమెరికా వైఖరి ప్రస్ఫుటం కాలేదు. వైట్ హౌస్‌లో ట్రంప్, జెలెన్ స్కీల సంభాషణల్లో చోటుచేసుకున్న సందిగ్ధత వలన ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతి ఒప్పందం కుదరకపోగా, ఇరుదేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. తాను అధికారంలోకి వస్తే యుద్ధాన్ని ఆపుతానని శాంతి దూత తరహాలో మాట్లాడిన ట్రంప్ ఇటీవల ఉక్రెయిన్- ,రష్యాల మధ్య జరిగిన బీభత్సమైన దాడుల గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు ఫలించలేదు. ఉక్రెయిన్- రష్యాల మధ్య కాల్పుల విరమణ జరగలేదు. కేవలం యుద్ధ ఖైదీల మార్పిడి కోసమే ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది.

గత మూడు సంవత్సరాలకుపైగా సాగుతున్న యుద్ధంవలన ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. పుతిన్, జెలెన్‌స్కీల అహంభావం ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నెడుతున్నది. భారీ విధ్వంసకరమైన ఆయుధాలతో వినాశనాన్ని చవిచూస్తున్న ఇరుదేశాల ప్రజల పరిస్థితి ఎవరికీ పట్టడంలేదు. ఎన్నికలు జరపకుండా యుద్ధం పేరుతో జెలెన్‌స్కీ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూడడం బాధాకరం. నాటో కూటమిలో చేరాలని జెలెన్‌స్కీ ఆరాటపడడం రష్యా మనుగడకు ఇబ్బందికరమని తెలిసినా, తన మొండి వైఖరిని విడనాడకపోవడం ఆశ్చర్యకరం.

యుద్ధాన్ని నిలువరిస్తానని వాగ్దానం చేసిన ట్రంప్ పూటకో మాట మార్చే ఫక్తు వ్యాపార వేత్తలా మారిపోయాడు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగడం వలన ప్రపంచానికి ఎలాంటి మేలు ఒనగూరేలా లేదు. ఒక వైపు ఉక్రెయిన్‌లోని రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ట్రంప్ ఆరాటపడుతుంటే, మరోవైపు ఉక్రెయిన్‌లోని మైనింగ్ ప్రాంతాన్ని, ఆర్థిక వనరులను తన వశం చేసుకోవాలని పుతిన్ ఆరాటపడుతున్నాడు. 43 లక్షల కోట్ల రూపాయల విలువైన అరుదైన టైటానియం, లిథియం, యురేనియం, గ్రాఫైట్ వంటి అపారమైన భూగర్భ ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి అమెరికా చేసిన ప్రయత్నాల్లో జెలెన్‌స్కీ ఒక పావులా మారిపోయాడు. మూడేళ్లుగా ఉక్రెయిన్‌కు అందించిన యుద్ధ సహాయానికి బదులుగా ఉక్రెయిన్ ఖనిజ సంపద అమెరికా వశం కానున్నది.

అమెరికా ఉక్రెయిన్ల మధ్య కుదిరిన మినరల్ వెల్త్ డీల్ ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందనే వాదనలో నిజమెంత? అఫ్ఘానిస్తాన్‌లో అనుసరించిన విధానమే ఉక్రెయిన్‌కు అమెరికా వర్తింపచేస్తుందా? అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లను ఎదిరించి, అక్కడ విద్య, రక్షణ, ఉపాధి రంగాలకు ప్రోత్సాహమిచ్చిన అమెరికా అర్ధాంతరంగా అఫ్ఘన్‌ను వదలిపెట్టి పోయింది.వేలాది మంది సైన్యాన్ని కోల్పోయి, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అమెరికా, ఉక్రెయిన్ విషయంలో కూడా ఇదే విధంగా తలదూర్చి ఆర్థికంగా తీవ్రసంక్షోభానికి గురైనది. అమెరికా అహంభావం ఆ దేశ ఆర్థిక దివాళాకు దారితీసింది. ఆర్థికంగా నష్టపోయిన అమెరికా ప్రస్తుతం ట్రంప్ సారథ్యంలో వ్యాపార దృక్ఫథానికి తెరతీసింది.

భారత్‌తోసహా ఇతర దేశాలను తన వ్యాపార చట్రంలో ఇరికించి లబ్ధిపొందాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధం అమెరికాకు ప్రయోజనకారిగా మారింది. జెలెన్‌స్కీ తప్పిదాలు అమెరికా వ్యాపారానికి ఆయాచిత వరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పుతిన్‌ను ఒప్పించి, ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధానికి అమెరికా ముగింపు పలుకుతుందా? రష్యా అందుకు అంగీకరిస్తుందా? రష్యాకు ఏ మాత్రం సరితూగని ఉక్రెయిన్ ఇంత భారీ స్థాయిలో సంవత్సరాల తరబడి యుద్ధం చేయడం వెనుక అమెరికా ప్రోద్బలముంది.

అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నాటో మిత్ర దేశాలతో కలిసి రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్‌ను పురిగొల్పడం, ట్రంప్ అధికారంలోకి వచ్చాక జెలెన్‌స్కీని బెదిరించి, యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలంకావడం విదితమే. పుతిన్‌తో ట్రంప్‌కు గల రహస్య స్నేహం వలన ఉక్రెయిన్‌కు నష్టం జరుగుతుందని ఊహించిన జెలెన్‌స్కీ అమెరికాతో వాదనకు దిగడంతో రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదరలేదు. ఇరుదేశాల మధ్య కొంతకాలం కాల్పుల విరమణ జరిగినా మరలా యుద్ధాన్ని తీవ్రతరం చేయడం ఆశ్చర్యకరం. ట్రంప్ మధ్య వర్తిత్వానికి రష్యా కూడా సంసిద్ధంగా లేదు. అందుకే ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్టుగా భావించడంలో తప్పు లేదు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరుదేశాలే కాకుండా ప్రపంచ దేశాలన్నీ మరింత ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడతాయి. ఇరుదేశాల అహంకారపూరిత వైఖరి అణుయుద్ధానికి, మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలను తోసిపుచ్చలేం.

సుంకవల్లి సత్తిరాజు
9704903463

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News