పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారతదేశానికి అబేధ్యమైన రక్షణ కవచంగా నిలచిన ఎయిర్ డిఫెన్స్ ను మరింత బలో పేతం చేసేందుకు రష్యా మరిన్ని ఎస్ -400 యునిట్లను కొద్ది నెలల్లో సరఫరా చేయనున్నది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థను త్వరగా సరఫరా చేసేందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఈ యూనిట్లలో ఒకటి 2026 నాటికి, మరొకటి 2027 నాటికి భారతదేశానికి చేరుకోగలవని అంచనా. 2018లో ఐదు ఎస్-400 యూనిట్లకు ఆర్టర్ అందజేయగా ఈ రెండు యూనిట్లు సరఫరా కావల్సి ఉంది. నిరుడు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా పర్యటన సందర్భంగా, అలాగే భారత- రష్యా ద్వైపాక్షిక చర్చలలో ఈ యూనిట్లు అందించడంలో జాప్యంపై ప్రస్తావన వచ్చింది.
ఈ రెండు యూనిట్లతో పాటు, భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సుదర్శన్ చక్ర ప్రాజెక్టు అభివృద్ధికి తోడ్పడేందుకు మరిన్ని ఎస్ -400 వ్యవస్థలను కొనుగోలు చేయాలనిఆలోచిస్తోంది.
స్వాతంత్ర దినోత్సవంనాడు ప్రధాని మోదీ ఎర్రకోట పై ప్రసంగిస్తూ ప్రకటించిన బహుళ స్థాయి ఫ్రేమ్ వర్క్. సుదర్శన్ చక్ర. ఇది దేశ రక్షణకు సంబంధించి అధునాతన నిఘా, సైబర్ రక్షణ వ్యవస్థలను ఏకీకృతం చేస్తుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో గేమ్ ఛేంజర్ గా పిలిచే ఎస్ – 400 భారత సైనిక దళాలకు విలువైన ఆస్థిగా నిలిచిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్, మే నెలలో పాక్ తో జరిగిన ఘర్షణలో పాక్ పలు క్షిపణులను ప్రయోగించినా ఎస్ -400 కారణంగా భారత దేశంలోకి చొచ్చుకు రాలేక పోయింది. ఎస్ -400 క్షిపణి వ్యవస్థ 600 కిలోమీటర్ల దూరంలోని శతృవుల కార్యకలాపాలను గుర్తించగలదు. ఒకే సారి 100 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. 400 కి.మీ. పరిధి వరకూ గురి పెట్టి బాంబర్లు, ఫైటర్ జెట్ లు, డ్రోన్ లు, బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగలదు.