వరుసగా రెండోసారి యుఎస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం
ఫైనల్లో అమందాపై గెలుపు
న్యూయార్క్: గతేడాది అద్భుత ఆటతీరుతో యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అరియానా సబలెంక ఈ ఏడాది సయితం టైటిల్ కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది బెలారస్ భామ. శనివారం అర్ధ రాత్రి జరిగిన తుది పోరులో అమెరికా క్రీడాకారిణి అమందా అనిసిమోవాపై 6-3, 7-6(3) వరుస సెట్లలో గెలుపొంది మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సునయాసంగా విజయం సాధించిన సబాలెంక కెరీర్‌లో నాలుగోసారి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించింది. ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడినా సబలెంక మొక్కవోని ఆత్మవిశ్వాసంతో విజయం సాధించి టైటిల్‌ను ఒడిసిపట్టింది. ఇక వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనుకున్నా యుఎస్ భామ అనిసిమోవా అశలపై నీళ్లు చల్లింది. ఇప్పటి వరకూ అనిసిమొవాతో 9 సార్లు తలపడి ఓటమిని చివిచూసిన సబలెంకా 10వ పోరులో విజయం సాధించి టైటిల్ గెలవడం ఓ అద్భుతం.
సబలెంకా ఆధిపత్యం..
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో అరియానా సబలెంకా టై-బ్రేక్‌లో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ తన ఆధిపత్యాన్ని చెలాయించింది. వరుసగా 19వ టై-బ్రేక్‌ను 7/3తో గెలిచి, కేవలం 1 గంట 34 నిమిషాల్లో మ్యాచ్‌ను తన వైపు తిప్పుకుంది. అనిసిమోవా కీలక సమయాల్లో చేసిన పొరపాట్లను సభాలెంకా సద్వినియోగం చేసుకుంది. దీంతో సబలెంకా తొలి సెట్‌లో 6-3 తేడాతో సునయాసంగా గెలిచింది. కానీ రెండో సెట్‌లో అనిసిమోవా గట్టి పోటీనిచ్చింది. సబలెంకా 5-4 ఆధిక్యంతో విజయం సాధించేందుకు సమీపంలో ఉండగా.. అనిసిమోవా అద్భుత ఆతో బ్రేక్ చేసి స్కోరును సమం చేసింది. ఆ సమయంలో మ్యాచ్ మూడో సెట్‌కు వెళ్తుందా అని అందరూ భావించారు. కానీ టై-బ్రేక్‌లో సబలెంకా మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి 6-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి అలవోకగా మ్యాచ్‌లో విజయం సాధించింది.
సబలెంకా రికార్డు
యూఎస్ ఓపెన్‌లో అరియానా సబలెంకా రికార్డు సృష్టించింది. వరుసగా రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. గతంలో 2012-14 మధ్య సెరెనా విలియమ్స్ ఈ ఘనత సాధించగా.. తాజాగా సబలెంకా ఆ ఘనతను కైవసం చేసుకుంది. ఈ విజయంతో అరియానా సబలెంకా మహిళల టెన్నిస్‌లో అగ్రస్థానంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
Also Read: ఆసియా కప్ హాకీ విజేత భారత్