వచ్చే రెండు మాసాలు వర్షాలు, వరదలు వచ్చేకాలం ఎవరికి వాళ్ళు తీసుకునే తగు జాగ్రత్తలే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది. ఎమరుపాటుతో ఉంటే జీవితాలను అతలాకుతలం చేస్తాయి. మీరు తీసుకునే నివారణ చర్యలే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది. అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్నవారికి, ప్రభుత్వానికి అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసి ఫుల్‌చేసి ఉంచుకోండి. ఎప్పటికప్పుడు వాతావరణ అప్‌డేట్స్ కోసం రేడియో వినండి, టివి చూడండి, వార్తాపత్రికలను చదవండి, అధికారిక వాతావరణ బులెటిన్స్ చూడండి. కొన్ని రోజుల వరకు సరిపడేలా తగినన్ని ఆహార పదార్థాలను, నిత్యావసర సరుకులు, నీటిని నిల్వ చేసుకొని, అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోండి.
విలువైన పత్రాలు, సర్టిఫికేట్లు, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ బ్యాగ్‌లలో భద్రపరచండి, వర్షాలు, వరదలు ఉన్నా, తగ్గినా కొద్ది రోజులపాటు వేడిచేసిననీటిని మాత్రమే తాగండి. సమీపంలోని కాలువలు, చెరువులు, డ్రైనేజీ ఛానల్స్ లాంటి వరదవచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి తెలుసుకోండి. మీకు దగ్గరలో ఏదైనా బహిరంగ కాలువలు లేదా మ్యాన్‌హోల్‌ల వద్ద స్పష్టంగా కనిపించేలా ఎరుపు జెండాలు లేదా బారికేడ్లు లేదా మరే ఇతర ఏవైనా సంకేతాలు ఉంచండి. తప్పని పరిస్థితులలో వర్షంలో బయటకు వెళాల్సి వస్తే ఒక కర్రను తీసుకుని, నీటి లోతు చూసిన తర్వాతే అక్కడ అడుగులు వేస్తూ వెళ్ళండి. వర్షం నీరు నిలువ ఉంటే దోమలు, ఇతర క్రిమికీటకాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ, క్రిమిసంహారకాలను ఉపయోగించండి. వర్షాలు ఎక్కువపడి వరదనీరు ఇంట్లో నీరు చేరితే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయండి. విద్యుత్ ఉపకరణాలను అన్‌ప్లగ్ చేయండి, గ్యాస్ కనెక్షన్‌ను ఆఫ్ చేయండి. పశువులు, పెంపుడు జంతువులను షెడ్‌లో ఉంచండి, వాటిని తాళ్లతో కట్టేయకండి, మీకు పై అంతస్తు ఉంటే విలువైన వస్తువులను పైఅంతస్తుకు తరలించండి, మీ ప్రాంతంలోని హెల్ప్ లైన్ నెంబర్లను ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
అది మీకు అవసరం లేకున్నా, అవసరమైన వాళ్లకు ఉపయోగపడవచ్చు, కాలనీలో ఉండేవాళ్ళు కాలనీ ప్రజలు అందరూ కలసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఒకరికి ఒకరు ఆసరా అవ్వండి. అత్యవసర సమయంలో సంప్రదించడానికి మీకు దగ్గరలో ఉన్న ఆసుపత్రి నంబర్లను, అగ్నిమాపక అధికారుల నంబర్లు, స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్లు రాసుకొని జాగ్రత్త పరచుకోండి. మీ ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ గ్రామ పంచాయితీకి, మున్సిపాలిటీ, జిహెచ్‌ఎంసి పరిధిలో ఉంటే వాళ్ళ నంబర్లు సిద్ధం చేసుకొని ఉంచుకోండి. చెత్తను ఎక్కువగా ఉంచకండి. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోండి. వరద ముప్పు ఉన్న ప్రాంతాలలో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ కిట్‌ను సిద్ధపరచుకోండి. వర్షాలు తగ్గిన తర్వాత మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి తప్పనిసరిగా దోమతెరలను ఉపయోగించండి.
రోడ్ల పైన నడిచేవాళ్ళు పక్కన ఉండే కరెంటు స్తంభాలను తాకుండా నడవండి. కరెంటు ఎక్కడైనా తెగిపడ్డట్టు కనిపిస్తే దూరంగా ఉండండి, ఆ ప్రాంతం నుంచి వెళ్ళకండి. చెట్ల కింద, పురాతన భవనాల క్రింద నిలబడకండి. పిడుగులు పడే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. పిడుగులు పడే సమయంలో పసిపిల్లలకు అత్యంత భద్రతా కలిపించండి. నదులలో, సముద్రంలో వేటకు వెళ్ళేవాళ్ళు వరదలు తగ్గేవరకూ వెళ్లకుండా ఉండాలి, ఇతరులు సముద్రంలోపలికి వెళ్లకుండా నిరోధించేలా చర్యలు తీసుకోవాలి. విపరీతంగా వర్షాలు పడే సమయంలో రైతులు పొలం పనులు చేయకుండా ఉండాలి.
గొర్రెలు, మేకలు, బర్రెలు ఇతర జంతువులను మేపేవాళ్లు ఎత్తైన ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థిని, విద్యార్థులు కచ్చితంగా గొడుగు, రెయిన్ కోట్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ముంపు ప్రాంతాలలో ప్రజలు చిక్కుకుంటే వారికి ఆహారం, నీరు, నిత్యావసర వస్తువులు అందించేలా ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలి, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రజల ఆరోగ్యానికి కావలసిన ఔషధాలు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ప్రతి ఆసుపత్రిలో సిబ్బంది కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సూచనలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకొని అప్రమతంగా ఉన్నప్పుడే మరింత భద్రంగా ఉంటారు.
వై. సంజీవ కుమార్, 93936 13555