Tuesday, May 20, 2025

అదరగొడుతున్న సాయి, గిల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్ 18లో గుజరాత్ టైటాన్స్ అసాధారణ ఆటతో ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరుకుంది. గుజరాత్ విజయాల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ ఓపెనింగ్ జంట ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. ఇటు శుభ్‌మన్ అటు సుదర్శన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో పెను ప్రకంపనలు సృష్టించారు.

ఇద్దరు పోటీపడి షాట్లు కొడుతూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు క్యాపిటల్స్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. శుభ్‌మన్, సాయిలు చివరి వరకు అజేయంగా నిలిచి గుజరాత్‌కు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సాయి 61 బంతుల్లోనే 108 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్ కూడా 53 బంతుల్లోనే అజేయంగా 93 పరుగులు సాధించాడు. వీరిద్దరూ విధ్వంసక ఇన్నింగ్స్‌తో 205 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో ఓవర్ మిగిలివుండగానే ఛేదించింది.

నిలకడైన బ్యాటింగ్..

ఈ సీజన్‌లో గుజరాత్ విజయాల్లో గిల్, సాయిలదే కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఇద్దరు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. ఆరంభ మ్యాచ్ నుంచే ఇద్దరు జట్టుకు మంచి ఆరంభాన్ని అందిస్తున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరూ ఆఖరి వరకు క్రీజులో నిలుస్తూ జట్టు విజయాల్లో తమవంతు సహకారం అందిస్తున్నారు. గుజరాత్ అగ్రస్థానంలో నిలిచిందంటే వీరి పాత్ర చాలా కీలకమనే చెప్పాలి.

ఇటు సుదర్శన్ అటు గిల్ విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ జోడీని కట్టడి చేయలేక ప్రత్యర్థి జట్ల బౌలర్లు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. ఇద్దరు కూడా ఈ సీజన్‌లో 600 పరుగుల మైలురాయిని దాటారు. బ్యాటింగ్‌లో సాయి అగ్రస్థానంలో నిలువగా అతని తర్వాతి స్థానాన్ని గుజరాత్ కెప్టెన్ గిల్ దక్కించుకున్నాడు. సాయి సుదర్శన్ ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచుల్లో 56.09 సగటుతో 617 పరుగులు సాధించాడు.

అతను 157 సగటుతో సాయి ఈ పరుగులను సాధించడం విశేషం. ఈ సీజన్‌లో సాయి ఒక సెంచరీ, మరో ఐదు అర్ధ సెంచరీలు బాదాడు. అంతేగాక 20 సిక్సర్లు, 68 బౌండరీలు కొట్టాడు. మరోవైపు కెప్టెన్ గిల్ కూడా అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్‌లో గిల్ 12 ఇన్నింగ్స్‌లో 60కి పైగా సగటుతో 601 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఏడు అర్ధ సెంచరీలు కూడా బాదేశాడు. రెండు సార్లు 90కి పైగా పరుగులను నమోదు చేశాడు. దీన్ని బట్టి సాయి, గిల్‌లు ఈ సీజన్‌లో ఎలా చెలరేగి ఆడుతున్నారో ఊహించు కోవచ్చు. 2025 ఐపిఎల్‌లో గుజరాత్‌ను ఒంటిచేత్తో ప్లేఆఫ్ బెర్త్‌కు చేర్చిన ఘనత ఈ ఇద్దరికే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News