న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. 35 ఏళ్ల సైనా ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. పెళ్లై ఏడు సంవత్సరాల తర్వాత తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనను అభిమానులతో పంచుకున్నారు. “జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళుతుంది. చాలా ఆలోచన, చర్చల తర్వాత కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ప్రశాంతతను ఎంచుకున్నాం. ముందుకు సాగడానికి ఉత్తమమైనదాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకుని గౌరవించినందుకు ధన్యవాదాలు” అని సైనా నెహ్వాల్ ఇన్ స్టాలో చెప్పుకొచ్చారు.
కాగా.. నెహ్వాల్, కశ్యప్ ఇద్దరూ కలిసి ఎన్నో విజయాలు సాధించారు. నెహ్వాల్ ఒలింపిక్ కాంస్య పతకం, ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ కు ఎదగగా.. పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణం గెలుచుకున్నారు. దశాబ్దానికి పైగా ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. ఆట నుండి రిటైర్ అయిన తర్వాత కశ్యప్ కోచింగ్‌లోకి మారారు. అయితే, విడిపోతున్న సైనా నెహ్వాల్ ప్రకటనపై కశ్యప్ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.