అమరావతి: టిడిపి ఆఫీస్ పై దాడికి సంబంధించి విచారణకు పిలిచారని వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు సజ్జల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి నేత పట్టాబి ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు అని అన్నారు. దాడులకు తమ నాయకుడు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకమని చెప్పారు. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలని తెలియజేశారు. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేనని, ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు.
ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని, కంతేరు మహిళా ఎమ్ పిటిసి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని సజ్జల మండిపడ్డారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా వెళ్లారని, పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్నవారిని కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దృష్టిని మళ్లించడానికి కృత్రిమ స్కాంలు సృష్టిస్తున్నారని, లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసేనని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.