ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో సమంత మీడియాతో మాట్లాడుతూ “నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు. ‘శుభం’ చిత్రం చాలా బాగా వచ్చింది. మంచి కథ ఇది. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. కెరీర్ మొదలు పెట్టి దాదాపు 15 ఏళ్లు అయింది. నాకు ఇంత అనుభవం ఉంది కదా అని ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించాను. ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను ప్రారంభించాం. 8 నెలల్లోనే చిత్రాన్ని పూర్తి చేశాం.
ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ‘శుభం’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఉంది. ఈ చిత్రంలో ఎక్కువగా సీరియల్ గురించి ఉంటుంది.. ఆ సీరియల్‌లో శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందా? అని అంతా ఎదురుచూస్తుంటారు. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఇక నా ప్రొడక్షన్ కంపెనీకి ట్రా లా లా అని పెట్టడానికి కూడా కారణం ఉంది. చిన్నప్పుడు ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్’ అనే పద్యం ఉండేది. అందుకే ట్రా లా లా అని పెట్టాం. ఎన్నో కలలు కంటూ సినిమా పరిశ్రమలోకి వస్తారు. మా చిత్రం కోసం శ్రియా, శ్రావణి, షాలినీలు ఎంతో కష్టపడ్డారు. నా సినిమాలో నటించిన వారందరినీ చూస్తే నా పాత రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. ‘శుభం’ చిత్రంలోని కేమియో పాత్రని నేను చేయాల్సింది కాదు. కానీ నిర్మాతగా మొదటి సారిగా నేను ఎవరి దగ్గరకు వెళ్లి అడగాలని అనుకోలేదు. అందుకే ఆ పాత్రను నేనే పోషించాను. ప్రస్తుతం నేను ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని చేస్తున్నాను. జూన్ నుంచి మళ్లీ షూట్‌కు వెళ్తున్నాం”అని అన్నారు.