రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ ను నిబంధనలకు విరుద్దంగా మార్చారని, దానిని మార్చాలని చౌటుప్పల్ సమీపంలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హయత్ నగర్ లోని లెక్చరర్ కాలనీలో శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుడు, నారాయణపురం మండల పరిషత్ మాజీ వైస్‌ప్రెసిడెంట్ నడికుడి అంజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం రీజినల్ రింగ్ రోడ్డుకు
నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు మార్గం ఉంటుందని చెప్పి, 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల మీదుగా రోడ్డుకు మార్కింగ్‌చేయడం ఏమాత్రం సరికాదన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న బడా బాబుల కంపెనీల భూములను కాపాడడానికి చిన్న, సన్నకారు రైతుల జీవితాలను బలిపీఠమెక్కిస్తున్నారని ఆయన ఆరోపించారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా ట్రిఫుల్‌ఆర్ ప్రతిపాదించారని ఆరోపించారు.
ఎట్టి పరిస్థితిలో సహించం
నిబంధనలకు విరుద్ధంగా మార్కింగ్‌చేసి భూములు గుంజుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రాణాలు పోయినా భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టం చేశారు. ట్రిఫుల్‌ఆర్ భూసేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడా బాబుల భూములను రక్షిస్తూ పేదల భూములలో మార్కింగ్ వేస్తున్నారని ఆగ్రహం చేశారు. ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న ప్రాంతాల మీదుగా, పారదర్శకంగా నిబంధనలు పాటించి రోడ్డు నిర్మించాలని వారు సూచించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం తమ భూములను ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సరైన సమాధానం చెప్పకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మార్గాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన భూనిర్వాసిత రైతులు పాల్గొన్నారు.