Friday, July 11, 2025

సంగారెడ్డి మహిళలు స్కై వారియర్స్

- Advertisement -
- Advertisement -

 డ్రోన్ల సాయంతో వ్యవసాయం
అద్భుతం దేశంలో నారీశక్తికి
ఉదాహరణగా నిలిచారు
సాంకేతికత, సంకల్పం కలిసి
నడిస్తే మార్పు వస్తుందని
ఆడపడుచులు నిరూపించారు
మన్ కీ బాత్‌లో ప్రధాని
నరేంద్ర మోడీ ప్రశంసల జల్లులు

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామీణ భారతంలో అద్భుతమైన మహిళా సాధికారతకు తెలంగాణలోని సంగారెడ్డి మహిళలు ఉదాహరణగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. దేశంలో నారీ శక్తికి ఉదాహరణగా తెలంగాణ మహిళలు నిలిచారని కొనియాడారు. ఇప్పుడు గ్రామీణ మహిళలు డ్రోన్ దీదీలుగా మారి డ్రోన్ ఎగురవేస్తున్నారని, వ్యవసాయంలో కొత్త విప్లవాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ మహిళా శక్తిని ప్రశంసలతో ముంచెత్తారు. ఒకప్పుడు వ్యవసాయ పనులకు ఇతరులపై ఆధార పడిన మహిళలు ఇప్పుడు సొంతంగా డ్రోన్ల ద్వారా సాగు చేస్తూ ‘స్కై వారియర్స్‘గా మారారని ప్రధాని మోడీ అభినందనలతో ముంచెత్తారు.

సంగారెడ్డిలోని మహిళలు 50 ఎకరాలకు పైగా సాగు చేస్తున్న పంట పొలాల్లో పురుగు మందులను పిచికారి చేయడానికి డ్రోన్లను ఉపయోగించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. ఇలా డ్రోన్ల సహాయంతో ఉదయం మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలు వ్యవసాయ పనులు చేపట్టడం వల్ల రైతులు తీవ్రమైన ఎండ, విషపూరిత రసాయనాల బారిన పడే ప్రమాదం తగ్గడంతో పాటు పని సమర్థత పెరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ మహిళలను చూసి గర్విస్తున్నానని ప్రధాని తెలిపారు. ఇప్పుడు ఈ మహిళలు ’డ్రోన్ ఆపరేటర్లు’గా కాదు, ’స్కై వారియర్స్’గా గుర్తింపు పొందారని ప్రధాని అన్నారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిచినప్పుడు మార్పు వస్తుందని మహిళలు నిరూపిస్తున్నారని తెలిపారు. కాగా, ఈ మార్పు నూతన సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా నారీ శక్తిని శక్తివంతం చేయడంలో మోడీ ప్రభుత్వం చూపిస్తున్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచిందని ప్రధాని మాట్లాడిన వీడియోను కిషన్‌రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేశారు.

పాక్ మరోసారి దాడికి యత్నిస్తే వందరెట్ల ప్రతిదాడి తప్పదు

భారత్‌పై పాక్ మరోసారి దాడికి ప్రయత్నిస్తే వందరెట్ల ప్రతిదాడి తప్పదని పాకిస్తాన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించారని తెలిపారు. తాము తాముగా ఎవరి జోలికి వెళ్లబోమ, తమ జోలికి వస్తే మాత్రం ఇక నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ప్రధానమంత్రి 122వ ఎపిసోడ్ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన సనత్‌నగర్‌లో కిషన్‌రెడ్డి ప్రజలతో కలిసి ఆదివారం వీక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సిందూరం గన్ పౌడర్‌గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని తెలిపారు. తన రక్తనాళాల్లో ప్రవహిస్తున్నది రుధిరం కాదు, సిందూరమని’ భావోద్వేగంగా ప్రధాని తెలిపారని అన్నారు.

పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిలబెట్టారంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పహల్గాం ముష్కరదాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా 22 నిమిషాల్లో తొమ్మిది భారీ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామని వెల్లడించారు. ఆ చర్య ద్వారా మన మహిళల సిందూరాన్ని చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేసినట్లు చెప్పారు. మోడీ చెప్పిన విధంగా స్వచ్ఛత, యోగా, డయాబెటీస్ లాంటి విషయాలను ఆచరణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రజలను జాగృతం చేస్తుందని క్యంగా నిలబెడుతుందని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఇందులోని ప్రధాని చేసిన సూచనలు, సలహాలు ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఆచరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News