Thursday, May 8, 2025

సంత్ కబీర్ మానవతావాద కవితలు

- Advertisement -
- Advertisement -

సాధారణ శకం పదిహేనవ శతాబ్దానికి చెందిన సంత్ కబీర్ దాస్ (13981518) బహుజన తాత్వికుడు, కవి. ఆనాటి సామాజిక స్థితిగతులపై తన దృఢమైన అభిప్రాయాల్ని వెలిబుచ్చినవాడు. విచారించాల్సిన విషయమేమంటే ఆరు శతాబ్దాల తర్వాత, నేటి సమాజంలో జన బాహుళ్యం, ఆయన ఆలోచనలతో పోలిస్తే ఇంకా వెనకబడే ఉన్నారు. ఇంకా మూఢ నమ్మకాల్లో మునిగితేలుతున్నారు. సంత్ కబీర్ దాస్ తన భావాల్ని ఆనాటి హిందీ భాషలో నాటి స్థితిగతుల్ని ‘దోహే’ అనే కవితా ప్రక్రియలో ప్రకటించాడు. అందులో కొన్ని నేనిక్కడ పొందుపరుస్తున్నాను. హిందీ తెలిసిన అర్థం చేసుకోవడం సులభమే. చేసుకోని వారి కోసం నేను ఇక్కడ తెలుగు సారాంశం ఇస్తున్నాను. చేయవల్సిందల్లా ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవడమే. వైజ్ఞానిక ప్రగతి సాధించుకున్న 21వ శతాబ్దాంలో జీవిస్తూ, అత్యాధునికులై ఉండి ఈ కాలానికి తగినట్టు ఆలోచిస్తున్నారా? లేక ఆరు వందల ఏళ్లకు పూర్వం జీవించిన సంత్ కబీర్ స్థాయిని కూడా అందుకోలేక పోతున్నారా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే!

పాత్తర్ పూజే హరీ మిలే, తొ మై పూజూ పహాడ్!
ఘర్‌కి చాకీ కోయీన పూజే జొకొ పీస్ ఖాయే సంసార్!!
రాయిని పూజిస్తే హరి (దేవుడు) దొరుకుతాడని అనుకుంటే, చిన్న రాయినే ఎందుకూ? నేను పెద్ద గుట్టనే పూజిస్తా. అయినా దేవుడు కనబడడమన్నది అబద్ధం. అయితే, ఇంట్లో రోజూ ధాన్యాన్ని పిండిగొట్టి ఆకలి తీర్చే విసుర్రాయి కూడా రాయే. దాన్ని ఎవరూ గుర్తించరు. అవసరమైన వాటిని వదిలేసి, అనవసరమైన వాటిని ప్రాధాన్యమిస్తున్నారని సంత్ కబీర్ చెపుతున్నాడు. ప్రాణాన్ని నిలబెట్టేది, జీవితాన్ని కొనసాగించేది విసుర్రాయి. అది ఓ మూల పడి ఉంటుంది. వసుర్రాయితో పోలిస్తే పూజించే రాయికి ఏ మాత్రం విలువలేదన్న సత్యాన్ని ఆయన స్పష్టంగానే చెప్పాడు.

మాటీక ఎక్ నాగ్ బనాకె పూజే లోగ్ లు గాయా!

జిందా నాగ్ జబ్ ఘర్ మె నికలే లేలాఠీ ధమ్ కాయా!! మట్టితో నాగు పాము బొమ్మ చేసుకుని ఇంట్లో పూజించే జనం నిజంగానే పాము ఇంట్లో కొస్తే ఏం చేస్తారూ? పూజిస్తారా? కర్ర తీసుకుని బయటికి తరిమేస్తారు. లేదా చితక్కొట్టి చంపేస్తారు. తమ క్షేమం తాము చూసుకుంటారు. దీనితో ఏం అర్థమవుతుందీ? నిజాన్ని పారద్రోలి అబద్ధాన్ని పూజించడం మనుషుల లక్షణం అని తెలుస్తోంది కదా? ఎందుకీ పిచ్చి ప్రవృత్తి? ప్రేమ, సమర్పణ భావం లేకుండా ఊరికే భయపడి దైవాన్ని పూజించడం మూర్ఖత్వం కదా? అన్నది కబీర్ భావన!

ఐసీ బాణీ బోలియే మన క ఆపా ఖోయ్!
ఔరన్ కొ శీతల్ క రే ఆపహు శీతన్ హోయ్!!
ఎదుటి వాడు ఏ జాతి వాడు, ఏ మతం వాడు, ఏ ప్రాంతం వాడు అనేది చూడకుండా మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమతో, గౌరవంగా మాట్లాడితే మీ ఇద్దరి మధ్య సంబంధం చల్లగా ఉంటుంది. అనవసరంగా ఎదుటి వాణ్ణి అగౌరవ పరుస్తూ కోపం వెళ్లగక్కితే ఎదుటి వాడు కూడా అదే పని చెయ్యొచ్చు కదా? అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? మీ విలువ మీ గౌరవం ఎక్కడ ఉంటుంది? ఈ చిన్న విషయం పాటించకనే కదా మన సమాజంలో మనువాదులు మనుషుల మధ్య అగాధాలు పెంచిందీ?
తిన్ క కబహు న నీందియే జో పావన్ తీర్ హాయ్!
కబహూఁ ఉడీ ఆంఖిన్ పడే తొఫిర్ ఘనేరి హోయ్!!

దేని విలువ దానికి ఉన్నట్లే, ఎవరి విలువ వారికి ఉంటుంది. ఎదుటి వారిని హీనంగా చూస్తే, అది మనల్నే దెబ్బ తీయొచ్చు. కాలి కింద అణగి ఉండే ఎండుగడ్డి ముక్క ఎగిరి వచ్చి కంట్లో పడితే అది ఎంత బాధాకరంగా ఉంటుంది? ఇక్కడ కవి కబీర్ దాస్ ఎండు గడ్డి గురించి మాత్రమే చెప్పడం లేదు. మనుషుల్ని బానిసలుగా మార్చిన అగ్రవర్ణం గురించి చెపుతున్నాడు. నిమ్న వర్గాలు బలహీనులే కావొచ్చు వారు తిరగబడితే అగ్రవర్ణ భూస్వాములు తట్టుకోగలరా? ప్రపంచంలో జరిగిన అణచివేతలు, తిరుగుబాట్లు కబీర్ చిన్న గడ్డి పరకతో జ్ఞప్తికి తెచ్చాడు. ప్రపంచ చరిత్రను ఒక వాక్యంలో వర్ణించడం కేవలం ఒక్క కవికి మాత్రమే చేతనవుతుంది.

జాతీన పూ ఛో సాధూకి, పూచ్ లీజియే జ్ఞాన్!
మోల్ కరో తల్ వార్ క పడా రహన్ దొ మ్యాన్!!
జ్ఞానులు సహజంగా అతి సామాన్యంగా ఉంటారు. వారికి అడిగి కొంత జ్ఞానం సంపాదించుకోవాలి గాని, నీ జాతి ఏది? నీదే కులం? నువ్వు ఎక్కడి వాడివి అంటూ ప్రశ్నల వర్షం కురిపించే వాడు అజ్ఞానే అయి ఉంటాడు. ఆత్మరక్షణ కోసం ఖడ్గం (తల్‌వాల్) పని కొస్తుంది గాని, ఖడ్గం దూర్చే (మ్యాన్) ఒర/ డాలు ఎందుకు పనికొస్తుందీ? రత్నాలతో పొదిగిన డాలు కావచ్చు. కాని అది రక్షించలేదు. మెదడులో సరుకేమీ లేనప్పుడు ఎంత డాబుగా కనపడినా లాభం ఉండదు. సర్వసంగ పరిత్యాగి అయిన సాధువును నీ జాతి ఏమిటని అడగడం ఎంత అవివేకం? జాతులుగా, వర్ణాలుగా మనుషుల్ని విభజించిన వైదిక ధర్మం మీద కబీర్ ఈ విధంగా తన కవితా ఖడ్గాన్ని ప్రయోగించాడు. అగ్రవర్ణాలు ప్రచారం చేసిన వర్ణ వివక్షను, మూర్ఖపు ఆచారాలను అలాగే కొన్ని జీవన సత్యాలను కబీర్ తన దోహాలలో స్పష్టం చేశాడు. అప్పటికి, నాస్తిక వాదం, హేతువాదం, మానవవాదం లాంటి పదాలే పుట్టలేదు. అయినా, క్రాంతిదర్శి, దార్శనికుడు అయిన బహుజన మేధావి సంత్ కబీర్ అవన్నీ అయ్యాడు. తన సమకాలీన ప్రజానీకాన్ని ఆలోచించమని కోరాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ ఆదర్శంగానే నిలబడి ఇకనైనా మేల్కొనండి మీరేమిటో మీరు గుర్తించుకోండి’ అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. ‘మనుషులంతా ఒక్కటే అని గ్రహించండి. బేధభావం విడనాడండి. మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు నిలుపుకోండి’ అని ఎలుగెత్తి చాటుతున్నాట్లుగా అనిపిస్తుంది. ఈ కాలానికి కూడా ఆయన స్ఫూర్తి ప్రదాతేనన్నది మనం గుర్తించుకోవాలి.

కబీరా కహే యె జగ్ అంధా, ఆంధీ జైసీ గాయ్!
బచ్ డా ధా సొ మర్ గయా, ఝాటీ చామ్ చటాయె!!
సమకాలీన ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో ప్రభుత్వాల పని తీరుకు దీన్ని అన్వయించుకోవచ్చు. ఆవుదూడ చనిపోతే, గడ్డితో ఆవుదూడ బొమ్మను తయారు చేసి ఆవును మోసం చేసి, పాలు పితుక్కుంటారు.. కదా? అలాగే, ప్రజలకు అందివ్వాల్సింది అందివ్వకుండా, వారి నుండి లాక్కునేది లాక్కోవడం నేటి రాజకీయ వ్యవస్థ చేస్తున్న పని. దేశప్రజల ముందు గడ్డి బొమ్మలు పెట్టి, వారి నుండి అన్ని రకాల పన్నులు వసూలు చేసే మోడీ ప్రభుత్వం ఒకటి వస్తుందని ఆరు వందల ఏళ్లకు ముందే సంత్ కబీర్ దాస్ ఊహించినట్టున్నాడు. కవి దార్శనికుడు కావడం అంటే ఇదే కబీర్ దాస్ కవితల్లో ఏ ఒక్కటీ తీసుకున్నా అది ఆనాటి సమాజ రుగ్మతల్ని చీల్చి చెండాడడం కనిపిస్తుంది. వందల ఏళ్లు గడిచినా ఆ రుగ్మతలు రుగ్మతలుగానే కొనసాగుతున్నందుకు మనమంతా సిగ్గుపడాలి.

ఆయన కవితా చరణాల వెంట నడుస్తూ, అందులో భావం, భావుకత, అంతకు మించి సమాజ శ్రేయస్సుకు ఆయన ఎంత తపించారో అర్థం చేసుకోవాల్సి ఉంది. వారణాసికి చెందిన ఈ కవి ఆలోచనలు హిందువులని, ముస్లింలని, సిక్కులని బాగా ప్రభావితం చేశాయి. ఆయన జీవించిన కాలంలో ఆయనపై దాడులకు దిగిన హిందువులున్నారు, ముస్లింలూ ఉన్నారు. ఆయన మరణానంతరం ఆయన తమ వాడేనని ఈ ఇరు వర్గాలూ సిగ్గు వదిలేసి ప్రకటించుకున్నాయి. ఆయన మాత్రం తన రచనల్లో అన్ని మతాల మత పిచ్చిని తీవ్రంగా దూషించాడు. కబీర్ ఆలోచనలకు సిక్కు మత గురువు గురునానక్ ప్రభావితుడయ్యారని చెపుతారు. అందుకే కాబోలు, వారి మత గ్రంథంలో ఈయన ఆలోచనలకు చోటు దొరికింది. విశ్వకవి రవీంద్రుడు కూడా కబీర్ భావాలకు ముగ్ధుడై కొన్నింటిని అనువదించాడు. ‘నిజాన్ని బతికించుకుంటేనే మనిషి ప్రశాంతంగా బతకగలడు’ అన్నది కబీర్ బోధనల సారాంశం!

డాక్టర్ దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News