ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టుని శనివారం బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్‌కి ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్‌మెంట్ ప్రకటించారు. తాజాగా ప్రకటించిన జట్టుకి కెప్టెన్సీ పగ్గాలు శుభ్‌మాన్ గిల్‌కు దక్కాయి. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపిక అయ్యాడు. దాంతో పాటు కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు (Sarfaraz Khan) ఈసారి కూడా నిరాశే ఎదురైంది.
గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఫిబ్రవరిలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన సర్ఫరాజ్ (Sarfaraz Khan).. ఆ తర్వాత బార్డర్-గవాస్కర్ ట్రోఫీ జట్టుకి ఎంపిక అయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా అతనికి ఆడే అవకాశం రాలేదు. దీంతో ఆడే అవకాశం ఇవ్వకుండా అతనిపై వేటు ఎలా వేస్తారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘బార్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత రెడ్‌బాల్ క్రికెట్ జరగలేదు. రంజీ మ్యాచ్‌లు జరిగినా గాయం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ ఆడలేకపోయాడు. దీంతో అతను ఫామ్ నిరూపించుకోవడానికి సరైన అవకాశం దొరకలేదు. నేను గతంలో చూశాను.. జట్టు సిరీస్ ఓడిపోతే.. 13, 14, 15 స్థానాల్లో ఉన్న ఆటగాళ్లపై వేటు పడుతోంది’ అని గవాస్కర్ పేర్కొన్నారు.