Wednesday, July 2, 2025

ఐ లవ్ యు అని చెప్పడం కేవలం భావాల వ్యక్తీకరణ మాత్రమే: బాంబే హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఐ లవ్ యు అని చెప్పడం కేవలం భావాల వ్యక్తీకరణ మాత్రమే, అది లైంగిక ఉద్దేశంతో చెప్పిన మాట కాదని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తీర్పు చెప్పింది. 2015లో టీనేజ్ అమ్మాయిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 35 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ, ఈ తీర్పు ఇచ్చింది. లైంగిక చర్య అంటే అనుచితంగా తాకడం, బలవంతం చేయడం, వస్త్రాలు గుంజడం, అసభ్యకరంగా హావభావాలు, ఆ మహిళను అవమానించే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయడం వంటివి ఉంటాయని జస్టిస్ ఊర్మిళా జోషి – ఫాల్కే ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఆ వ్యక్తి నాగపూర్ లో ఆమెను అడ్డుకుని, ఆమె చేయిపట్టుకుని ఐ లవ్ యు అని అన్నాడు.ఆ ఫిర్యాదు పై దాఖలైన కేసులో 2017లో నాగపూర్ లోని సెషన్స్ కోర్టు అతడిని ఐపిసీ,

పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద దోషిగా నిర్థారించి మూడు ఏళ్ల జైలుశిక్ష విధించింది. కాగా,హైకోర్టు ఆ వ్యక్తికి విధించిన శిక్షను కొట్టివేస్తూ, ఈ కేసులో బాధితురాలితో లైంగిక సంబంధం ఏర్పరచుకునే ఉద్దేశ్యం వ్యక్తమైనట్లు ఎలాంటి సూచనలు లేవని పేర్కొంది. ఐ లవ్ యు అని వ్యక్తీకరించబడిన పదాలు లైంగిక ఉద్దేశ్యాన్ని సూచించే మాటలు కావని కోర్టు వెల్లడించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఆ బాలిక స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా, ఆ వ్యక్తి ఆమెను అడ్డుకుని , ఆమె చేయి పట్టుకుని, ఆమె పేరు అడిగి, ఐ లవ్ యు అని అన్నాడు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి తండ్రికి ఈ ఘటనను వివరించింది. అనంతరం ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఎఫ్ ఐఆర్ దాఖలైంది. ఈ కేసు లైంగిక వేధింపుల పరిధిలోకి రాదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News