Friday, August 1, 2025

పాఠశాలలా! మృత్యుపాశాలా!!

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ ఝాలవార్ జిల్లాలో పిప్లోడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జులై 25న ప్రార్థన చేస్తుండగా ఘోర విషాదం సంభవించింది. స్కూలు భవనంలో కొంత భాగం కూలిపోయి ఏడుగురి ప్రాణాలను బలిగొంది. అనేక మంది గాయపడ్డారు. విద్యార్థుల్లో చాలా మంది గిరిజన వర్గాలకు చెందినవారు. ఈ స్కూల్ రాష్ట్రానికి ఆగ్నేయ దిశగా మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉంది. అలాంటి సంఘటనే మరునాడు నాగపూర్ జిల్లాలో జరిగింది. అయితే ఆ సమయంలో స్కూలు సెలవులో ఉంది. ఈ సంఘటనలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ప్రజాగ్రహం పెల్లుబికింది. పాఠశాలలా లేక మృత్యుపాశాలా! అన్న ఆవేదన వ్యాపించింది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యుడిఐఎస్‌ఇ) 2023 24 డేటా ప్రకారం రాజస్థాన్‌లోని 70,000 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 84 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

ముఖ్యంగా పేద, బడుగు వర్గాల పిల్లలే వీరంతా. ఈ స్కూళ్లలో 8000 పరమ అధ్వానస్థితిలో ఉన్నాయని విద్యావిభాగం అంచనా. అయితే ఈ విధంగా గుర్తించిన స్కూళ్లలో ఝాలవార్(Jhalawar in schools) స్కూలుకు చోటు లేకపోవడం విశేషం. అంటే ఈ స్కూలులో అంతగా సమస్యలు లేవని సరిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. సౌకర్యాల కల్పనకు గత రాష్ట్ర రెండు బడ్జెట్‌ల్లో రూ. 650 కోట్లు కేటాయించారు. కానీ ప్రభుత్వ యంత్రాంగంలోని అసమర్థత కారణంగా సరైన చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్షంగా రాష్ట్ర బిజెపి ప్రభుత్వం నిర్ణయించుకున్నా ఆ మేరకు ఫలితం కనిపించలేదు. ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థలపై శ్రద్ధ ప్రస్తుతం తగ్గినందున రాజస్థాన్ లోని విషాదం దేశం మొత్తం మీద మేలుకొలుపు కావాలి.

దేశంలోని పాఠశాలల్లో జరుగుతున్న ఇలాంటి విషాద సంఘటనలకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ తీవ్రంగా స్పందించింది. పాఠశాలల విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అత్యవసర మార్గదర్శకాలు జారీచేసింది. నివారించదగిన ప్రమాదాలైనప్పటికీ కనీస భద్రతా ప్రమాణాలు లోపించడం వల్లనే విషాద సంఘటనలు జరుగుతున్నాయని హెచ్చరించింది. ఎప్పటికప్పుడు పాఠశాలల భద్రతను సమీక్షించాలని, భవనాలు శిథిలావస్థలో ఉన్నప్పుడు మరమ్మతులు లేదా పునర్ నిర్మాణాలు చేపట్టాలని సూచించింది. ఈ సందర్భంగా 2021 లో పాఠశాలల భద్రతపై జారీ చేసిన మార్గదర్శకాలను, అలాగే 2016లో జాతీయ వైపరీత్య నివారణ హెచ్చరికలతోపాటు పాఠశాల భద్రతా ప్రమాణాలను మళ్లీ గుర్తు చేసింది.

పాఠశాల భవనాల పటిష్టత, విద్యుద్దీకరణ, అత్యవసర సమయాల్లో బహిష్కరణ ద్వారాలు, అగ్నిప్రమాద నివారణ వ్యవస్థలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించింది. ప్రమాద సమయాల్లో ఏ విధంగా వ్యవహరించాలో, ఎలా స్వయం రక్షణ పొందాలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తగిన శిక్షణ పొందాలని అప్రమత్తం చేసింది. విద్యార్థుల మానసిక, భౌతిక ఆరోగ్య పరీక్షలు కూడా చేయించాలని సూచించింది. ప్రమాదాలు జరిగినప్పుడు 24 గంటల్లో సంబంధిత అధికారులకు తెలియజేయాలని హెచ్చరించింది. అయితే ఇవన్నీ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన తరువాతనే అధికార యంత్రాంగం కళ్లు తెరుస్తోంది తప్ప ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు.

విద్యారంగంపై వ్యయం జిడిపిలోని 4.6 శాతం నుంచి 6 శాతం వరకు తక్షణం పెంచాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఇపి) 2020లో పిలుపునిచ్చింది. మిగతా అవసరాల కన్నా సదుపాయాల కల్పనే ముఖ్యంగా సూచించింది. ఎన్‌ఇపి 2020 చెప్పుకోదగిన సంస్కరణలు సూచించినప్పటికీ, ఐదేళ్లలో దేశంలోని ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు మెరుగుపర్చడం చాలా తక్కువగానే జరిగింది. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వ మద్దతును స్వయం ఆర్థిక సహాయాన్ని తగ్గించడం వైపే విధానపరమైన ఒత్తిళ్లు ఎక్కువగా వచ్చాయి. ప్రైవేట్ రంగ పెట్టుబడులనే ప్రోత్సహించాయి. యుడిఐఎస్‌ఇ 201920 నివేదిక ప్రకారం దేశంలో 6465 స్కూళ్లకు భవనాలు లేవు. 35 స్కూళ్ల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి.

4417 స్కూలు భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. దేశంలో మొత్తం 15,07, 708 స్కూళ్లు ఉండగా, వీటిలో 10,32,570 స్కూళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో ఉన్నాయి.84,362 స్కూళ్లు ప్రభుత్వ సహాయంపై ఆధారపడి నడుస్తున్నాయి. 3,37,499 అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లు. ఇతర సంస్థల నిర్వహణలో 53,277 స్కూళ్లు నడుస్తున్నాయి. దేశంలోని మొత్తం పాఠశాలల్లో 10% పాఠశాలలకు చేతులు కడుక్కునే నీటి సదుపాయం కూడా లేదు. దీంతో విద్యార్థులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే 29.967 స్కూళ్లకు తాగునీటి సౌకర్యం లేదు.

అన్ని స్కూళ్లలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించాలన్న నిబంధన ఉన్నప్పటికీ, 201819 లో 2,67,074 స్కూళ్లలో వైద్య పరీక్షలు అసలు జరగకపోవడం శోచనీయం. ఇలాంటి పరిస్థితుల కారణంగా పేద, బలహీన వర్గాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను బలవంతంగా ప్రభుత్వ ఎయిడెడ్ లేదా ప్రైవేట్ స్కూళ్లకు వ్యయప్రయాసలకోర్చి పంపించక తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో విద్యకు రానురాను ఈ కేటాయింపులు తగ్గిపోతున్నాయి. 2021 22 బడ్జెట్‌లో అంతకు ముందు బడ్జెట్ కన్నా 8.3 శాతం కేటాయింపులు తగ్గించారు. విద్యారంగంపై ఈ విధమైన చిన్నచూపు భావిపౌరుల భవిష్యత్తుకే ముప్పు అన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించడం అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News