అమరావతి: మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రం పాఠశాల అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. పాఠశాలలు పవిత్ర దేవాలయాలు అని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పి పాఠశాలలో మెగా పిటిఎం 2.0 కార్యక్రమం నిర్వహించారు. పేరెంట్స్, టీచర్ల మెగా సమావేశంలో సిఎం పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సూచనలిచ్చారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..తాను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం కొత్త చెరువులో ప్రజలు ఇచ్చారని, పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్నానని తెలియజేశారు. చదువుకుని పైకి వచ్చినవారు స్కూళ్లకు ఎంతోకొంత చేయూత ఇవ్వాలని సూచించారు. విద్యావ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ కు అభినందనలు చెప్పారు.
ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్లను మరచిపోలేమని, తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుది అని అన్నారు. పనుల్లో పడి పిల్లల్ని మర్చిపోతున్నామని, లోకేష్ చదువుకునే రోజుల్లో ఎప్పుడూ పేరెంట్స్ మీటింగ్ కు వెళ్లలేకపోయానని గుర్తుచేశారు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వామ్యం (Parents share) కావాలని, తాను మహిళా పక్షపాతినని ఏ పని చేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తానని పేర్కొన్నారు. ఆడపిల్లలను చదివిస్తే ఏం వస్తుందని ఆనాడు అనుకునేవారని, మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదని అన్నారు. మగ, ఆడ బిడ్డలను సమానంగా చూసుకోవాలని, అందుకే ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. మీ పిల్లల చదువు బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.