Tuesday, July 15, 2025

భాగస్వామి ఫోన్ సీక్రెట్ రికార్డింగ్స్.. సాక్షాలే : విడాకుల కేసులో సుప్రీం

- Advertisement -
- Advertisement -

భార్యాభర్తల విడాకుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసుల్లో భాగస్వామి ఫోన్ సీక్రెట్ రికార్డింగ్‌లను సాక్షాలుగా పరిగణించవచ్చని వెల్లడించింది. వారి మధ్య వివాహ బంధం బలంగా లేదనే విషయాన్ని ఆ రికార్డింగ్స్ స్పష్టం చేస్తాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై పంజాబ్, హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కోర్టు పక్కన పెట్టింది. పంజాబ్ లోని బఠిండాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన పట్ట భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపించిన ఆయన , అందుకు సాక్షంగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను సమర్పించారు. దీన్ని పరిగణన లోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకుల కేసు విచారణను ప్రారంభించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆమె పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. తన సమ్మతి లేకుండా , తనకు తెలియకుండా ఆ సంభాషణలను రికార్డ్ చేశారని,

వాటిని సాక్షంగా పరిగణిస్తే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లేనని వాదించారు. ఆమె అభ్యర్థనను అంగీకరించిన హైకోర్టు, ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను పక్కన బెట్టింది. దీంతో ఆ భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బివి నాగరత్న నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. “ భార్యాభర్తల మధ్య సంభాషణకు సంబంధించిన సీక్రెట్ రికార్డింగ్‌లను సాక్షాలుగా పరిగణిస్తే వైవాహిక బంధాలు ప్రమాదంలో పడతాయని, భాగస్వాములపై నిఘా పెట్టడాన్ని ప్రోత్సహించినట్టు అవుతుందని కొందరు వాదిస్తున్నారు. కానీ ఆ వాదన సమర్థనీయమైనదని మేం భావించడం లేదు. ఒకరిపై ఒకరు నిఘా పెట్టే పరిస్థితికి వచ్చారంటే వారి మధ్య వైవాహిక బంధం ఎంతగా బీటలు వారిందో అర్థం చేసుకోవచ్చు. పరస్పర విశ్వాసం లేదని స్పష్టమవుతోంది. అందుకే ఆ రికార్డింగ్స్‌ను సాక్షాలుగా పరిగణించవచ్చు ” అని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం , ఈ విడాకుల కేసులో ట్రయల్ కోర్టు తమ విచారణ కొనసాగించవచ్చని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News