సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని జిహెచ్‌ఎంసి కార్యాలయంలో జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా విధులు నిర్వహిస్తున్న విఠల్ రావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రెండు భవనాలకు సంబంధించి ఓసి కోసం దరఖాస్తు చేసుకున్న సికింద్రాబాద్‌కు చెందిన వెంకట్‌రావును ఎసిపి విఠల్ రావు 8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతలో 4 లక్షలు తీసుకున్నాడు. మరో 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొత్తం డబ్బులు ఇస్తేనే ఓసి ఇస్తానని బెదిరించగా బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఎసిబి అధికారులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని జోనల్ కార్యాలయంలో విఠల్‌రావును అదుపులోకి తీసుకొని విచారించారు.
ఏసీబి డిఎస్‌పి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం… రెండు భవనాలకు సంబంధించి ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ ( ఓసి) కోసం రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేశాడని మొదటి విడతగా 4 లక్షల రూపాయలు సఫిల్‌గూడలోని ప్రభుత్వ వాహనంలోనే తీసుకున్నట్టు తెలిపారు. మేడిపల్లిలోని ఆయన నివాసం, నాచారంలోని ప్రైవేటు కార్యాలయంలో సోdeలు నిర్వహించినట్టు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నట్టు గుర్తించామన్నారు. విఠల్ రావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్టు తెలిపారు. లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జోనల్ కార్యాలయంలో లంచం ఇవ్వవద్దంటూ స్టిక్కర్లను అతికించారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.