Saturday, September 13, 2025

జన జీవన స్రవంతిలోకి కేంద్ర కమిటీ సభ్యురాలు

- Advertisement -
- Advertisement -

సిపిఐ మావోయిస్టు పార్టీలో 43 సంవత్సరాలుగా పనిచేసిన కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ కల్పన, అలియాస్ మైనాబాయి, అలియాస్ మైనక్క, అలియాస్ సుజాత శనివారం రాష్ట్ర డిజిపి జితేందర్ ఎదుట లొంగిపోయింది. 1982లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరడంతో ప్రారంభమైన సుజాత మావోయిస్టు ప్రస్థానం 62ఏళ్ల వయస్సులో అనారోగ్య కారణాలతో డిజిపి ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడంతో ముగిసింది. దీనికి సంబధించిన వివరాలు శనివారం డిజిపి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో డిజిపి జితేందర్ వెల్లడించారు. సుజాత స్వస్థలం జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలంలోని పెంచికల్పాడు. ఆమె తండ్రి తిమ్మారెడ్డి పెద్ద రైతు కాసు కుటుంబానికి చెందిన వారు, తల్లి వెంకమ్మ, సుజాతకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆమె పెద్దన్న పోతుల శ్రీనివాస్‌రెడ్డి 1982లో సుమారు రెండు నెలల పాటు సిపిఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ గ్రూప్‌లో పనిచేశారు.

Also Read: జిడిపిలో ఎంఎస్‌ఎంఇ లు పది శాతం వాటా సాధించాలి:మంత్రి శ్రీధర్ బాబు

పీపుల్స్ వార్ గ్రూప్ ఉద్యమ ప్రవేశం

సుజాతా గద్వాల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువున్న రోజుల్లో తన మేనబావ పటేల్ సుదాకర్ రెడ్డి అలియాస్ సూర్యం (కేంద్ర కమిటీ సభ్యుడు, 2009 ఎదురు కాల్పుల్లో మరణించారు), పోతుల సదర్శన్ రెడ్డి అలియాస్ ఆర్‌కే (డివిజన్ కమిటీ సభ్యులు, నల్లమల్ల అటవీ ప్రాంతంలో కృష్ణానదిలో మునిగి మరణించారు), సుగుణ (సుదర్శన్ రెడ్డి భార్య, ఎదురు కాల్పుల్లో మృతి చెందారు) ల ఆలోచనలు, సిద్దాంతాలతో మార్కిస్టు లెనినిస్టు భావజాలానికి ఆకర్షితురాలై 1982 లో సిపిఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరింది.ప్రారంభంలో రాడికల్ విద్యార్ధి సంఘం (ఆర్‌ఎస్‌యు) ఇచ్చిన గ్రామాలకు తిరిగి వెళ్దాం అనే పిలుపులో భాగంగా గ్రామ స్థాయిలో ప్రచార కార్యకర్తగా పనిచేసింది. జన నాట్య మండలిలో చేరి గద్దర్, ఇటీవల లొంగిపోయిన మాల సంజీవ్ అలియాస్ లెంగ దాదాతో కలిసి పనిచేసింది. కొంత కలం తరువాత జన నాట్య మండలిని వీడిన సుజాత సిపిఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న పీస్ బుక్ సెంటర్‌లో పనిచేసింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిశన్‌జీతో పరిచయం ఏర్పడటంతో 1894లో ఆయన్ను వివాహం చేసుకుంది.

పార్టీ ప్రస్థానంలో ఎదుగుదల
1987లో తన భర్త కిశన్‌జీతో పాటు సుజాత దండకారణ్య కమిటీలో భాగమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు వెళ్లారు. పార్టీ అజ్ఞాత పనుల్లో నిమగ్నం కావడంతో తన కూమార్తెను ఒక కార్యకర్త సంరక్షణలో వదిలి వెళ్లారు. 1988 నుంచి 1989 వరకు మెదట పెరిమిలి దళంలో పనిచేస్తూ ఎటపల్లి దళానికి బదిలీ అయింది. అక్కడ పటేల్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తూ డిప్యూటీ కమాండర్‌గా పదోన్నతి పోందింది. 1996లో ఉత్తర గడ్చిరోలి ప్రాంతంలోని దేవూరి దళం కమాండర్‌గా భాద్యతల నిర్వహణ చేపట్టింది. 1997 నుంచి 1999 వరకు దక్షిణ బస్తర్ కమిటీకి బదిలీ అయి, డివిజనల్ కమిటీ సభ్యురాలిగా, బాసగూడ ఏరియా కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించింది. 2001లో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీలో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొంది, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీకి ఇంచార్జ్‌గా పనిచేసింది. సిఎన్‌ఎం, కెఏఎంఎస్, డిఏకెఎంఎస్ వంటి అనుబంద సంస్థలు,

జనతన్ సర్కార్ గ్రామ కమిటీల బాధ్యతలు సుజాత నిర్వర్తించారు. 2007 లో మాడ్‌లో జరిగిన సిపిఐ(మావోయిస్టు) కాంగ్రెస్ కార్యక్రమంలో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ (డికెఎస్‌జడ్‌సి) కార్యదర్శిగా పదోన్నతి పొందారు. దీంతో పాటు జనతన్ సర్కార్‌తోపాటు సుక్మాలో సభ్యురాలిగా పనిచేశారు. 2008 ఆమె భర్త కిశన్‌జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ క్యాదర్శిగా బదిలీ అయ్యారు. 2018 లో మొత్తం దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీలోని జనతన్ సర్కార్ పూర్తి బాధ్యతలు చేపట్టారు. 2022లో పార్టీ ప్రధాన గెరిల్లా స్థావరం అయిన దక్షిణ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా బాధ్యతలు, 2023 లో సిపిఐ మావోయిస్తు కేంద్ర కమిటీలో చేరి, కేంద్ర కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. సుజాత పార్టీ బాధ్యతలతో పాటు కోయ భాషల ప్రచురితమయ్యే పేతురి అనే పత్రిక సంపాదకురాలిగా పనిచేశారు. ప్రతి సంవత్సరం మూడు సార్లు దక్షిణ సబ్ జోనల్ బ్యూరో ప్రాంతంలో ఈ ప్రతిక ప్రచురించబడేది.

అనార్యోగ కారణాలతోనే
సాధారణ సభ్యురాలి స్థాయి నుంచి కేంద్ర కమిటీ సభ్యురాలిగా 43 సంవత్సరాలు అజ్ఞాతంలో జీవించిన సుజాత ఈ ఏడాది మే నెలలో ఆరోగ్య పరిస్థితి క్షీణించిదని డిజిపి వెల్లడించారు. ఈ క్రమంలో జన జీవన స్రవంతిలోకి చేరాలని నిర్ణయించుకుని తన నిర్ణయాన్ని పుల్లూరి ప్రసాద్ రావు అనే వ్యక్తి ద్వారా కేంద్ర కమిటీకి సుజాతా తెలిపిందన్నారు. దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన తరువాత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం, కుటుంబంతో ప్రశాంత జీవితం గడిపేందుకు సుజాత ఈ నిర్ణయం తీసకున్నట్లు డిజిపి పేర్కొన్నారు.

రూ. 25 లక్షల చెక్కు అందచేత
జన జీవన స్రవంతిలో కలిసిన సుజాతకు పునరావాస ప్రయోజనంలో బాగంగా ఆమె పేరు మీద ఉన్న రివార్డు రూ. 25 లక్షలు డిమాండ్ డ్రాఫ్ట్‌ను డిజిపి ఆమెకు అందించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న పునరావాస పథకానికి అనుగుణంగా లొంగిపోయిన కేడర్లకు లభించే అన్ని ప్రయోజనాలు సుజాతకు అందచేస్తామని డిజిపి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుజాత గౌరవప్రదమైన జీవితాన్ని భద్రంగా తిరిగి నిర్మించుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామని డిజిపి స్పష్టం చేశారు.

పోరు వద్దు…ఊరు ముద్దు
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు పోరు వద్దు..ఊరు ముద్దు అనే నినాదంతో లొంగిపోవాలని పిలుపునిస్తుందని డిజిపి తెలిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలి లొంగుబాటు అజ్ఞాత కేడర్ పట్ల రాష్ట్ర పోలీసుల అవలంభించిన తీరుకు ప్రతీక నిలుస్తుందని డిపిజి అన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పోలీస్ విధానాలతో 404 మంది యుజీ కేడర్ సభ్యులు లొంగిపోయారని, వారిలో నాలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజనల్ కమిటీ కార్యదర్శి, ఎనిమిది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. ప్రస్తుతం అజ్ఞాత మావోయిస్టు కేడర్లు 78 మంది రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని, మొత్తం 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో పది మంది రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్లు డిజిపి వెల్లడించారు. అజ్ఞాత జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో చేరి ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొంది కుటుంబంతో సంతోషమైన జీవితాన్ని గడపాలని డిజిపి కోరారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ డిజి బి. శివరధర్ రెడ్డి, ఎస్‌ఐబి ఐజిపి సుమతిలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News