Tuesday, July 29, 2025

ఆలయాలపై ఆధిపత్య పోరు!

- Advertisement -
- Advertisement -

ఘర్షణలకు దూరంగా ప్రశాంతంగా ఉండే ఆగ్నేయాసియా ప్రాంతంలో ఇప్పుడు యుద్ధమేఘాలు అలముకున్నాయి. శాంతియుతంగా కలిసి మెలిసి ఉండే థాయిలాండ్, కంబోడియా దేశాలను సరిహద్దు వివాదాలు యుద్ధం అంచున నిలబెట్టాయి. గత నాలుగైదు రోజులుగా ఇరుదేశాల మధ్య ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులుగా మిగిలారు. ఈ సరిహద్దు వివాదం ఏకంగా థాయిలాండ్ ప్రధాని పదవికే ఎసరు తెచ్చింది. ఇంతకీ ఈ సరిహద్దు వివాదం ఏమిటి? ఇది వందేళ్లుగా సాగుతున్న వివాదం అని చెప్పాలి. ఇరు దేశాల మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంది. దీనిలో అత్యధిక భాగం ఈ దేశాలు ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడు నిర్ధారణ అయినది. స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇరుదేశాల మధ్య శత్రుత్వం లేకపోయినా సరిహద్దులు మాత్రం తరచూ ఘర్షణలతో రగిలిపోతున్నాయి.

ముఖ్యంగా ప్రముఖ ఆలయాలున్న ప్రీహ్ విహార్, టమోస్ థోమ్, టమ్యూన్ థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలిపి ఉన్న ప్రాంతాల కోసం ఈ పోరాటం సాగుతోంది. వీటిలో 9వ శతాబ్దానికి చెందిన ప్రీహ్ విహార్ ఆలయం కీలకమైంది. దీనిని ఖెమర్ పాలకులు నిర్మించారు. ఈ ఆలయం ఉన్న డాంగ్రెక్ పర్వతాల శిఖరం థాయ్‌లాండ్‌కు అత్యంత సమీపంలో ఉంది. ఈ ఆలయం కంబోడియాకు(Temple Cambodia) చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) తీర్పు ఇచ్చింది. దాన్ని థాయిలాండ్ కూడా అంగీకరించింది. కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. కంబోడియా విజ్ఞప్తి మేరకు ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది.

అయితే దీన్ని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా గతంలో చూపించిన మ్యాప్‌లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకుందని ఆరోపించింది. వాస్తవానికి ఇక్కడ సరిహద్దుల నిర్ధారణ జరగలేదు. 2008 11 మధ్య రెండు దేశాల మధ్య పలు ఘర్షణలు జరిగాయి. 2011లో దాదాపు డజను మంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది ప్రాణభయంతో ఇళ్లను వదిలి పారిపోయారు. కొన్నేళ్ల క్రితం ఐసిజె ఇచ్చిన మరో తీర్పు అగ్గిని మరింత రాజేసింది. ప్రీహ్ విహార్ పరిసర ప్రాంతాల్లో కంబోడియా సార్వభౌమత్వం ఉందని, అక్కడినుంచి థాయ్ సైన్యాలు వైదొలగాలని ఆదేశించింది. దీనికి థాయిలాండ్ అంగీకరించినా మ్యాప్‌లు, మిలిటరీ గస్తీలపై మళ్లీ వివాదం మొదలైంది. అలాగే థాయ్‌లాండ్ సురిన్ ప్రావిన్స్‌లోని ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ప్రాంతాలు కూడా ఇరు దేశాల మధ్య వివాదాస్పద ప్రదేశాలుగా మారిపోయాయి.

తాజాగా గత మే నెలలో జరిగిన ఘర్షణలో ఓ కంబోడియా సైనికుడు మరణించాడు. షినోమ్‌పెన్‌లో ఇది జాతీయవాదాన్ని రగిల్చింది. అంతేకాదు అధికారం చేపట్టిన పదినెలలకే థాయిలాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాకు పదవీగండం కూడా ఈ వివాదంనుంచే వచ్చింది. కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌తో ఫోన్‌కాల్‌లో మాట్లాడడమే కాకుండా ఆయనను అంకుల్ అని సంబోధించింది. థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెప్పింది. అయితే ఈ ఫోన్ సంభాషణ లీకయింది. ప్రధాని ఫోన్‌తో దేశప్రతిష్ఠ, ఆర్మీ గౌరవం మంట గలిశాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వంనుంచి కన్సర్వేటివ్ భూమ్‌జాయ్ థాయ్ పార్టీ వైదొలిగింది. షినవత్రా పదవిని కోల్పోయింది.

థాయ్‌లాండ్‌లో కంబోడియా వ్యతిరేక సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో ఈ ఉదంతం చెబుతుంది. తాజాగా వివాదాస్పద ప్రాంతాల్లో మందుపాతరలు పేలడంతో థాయ్ సైనికులు కొందరు గాయపడ్డారు. ఇది తమ ప్రాంతంలో జరిగిందని థాయ్‌లాండ్ ఆరోపిస్తుండగా కంబోడియా మాత్రం ప్రీహ్‌విహార్ ఆలయ పరిసరాల్లో చోటు చేసుకుందని వాదిస్తోంది. ఆ తర్వాత కూడా మరికొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి ముదిరి యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. థాయ్‌లాండ్ వాయుసేనకు చెందిన ఎఫ్16 యుద్ధ విమానాలు రంగంలోకి దిగి టమోస్ థోమ్ ఆలయ ప్రాంతంలో బాంబు దాడులు చేశాయి. ప్రతిగా కంబోడియా కూడా శతఘ్ని కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో డజన్ల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది తమ ఇళ్లను వదిలిపెట్టి పారిపోయారు. అయితే ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి ఇరుదేశాల నేతలతో ఫోన్‌లో మాట్లాడారు.

మలేసియా మధ్యవర్తిత్వంగా చర్చలు జరపడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. సోమవారం మలేసియా రాజధాని జరిగిన చర్చల్లో మంగళవారం అర్ధరాత్రినుంచి తక్షణం బేషరతుగా కాల్పుల విరమణకు ఇరుదేశాల నేతలు అంగీకరించడం శుభ పరిణామం. ఈ వివాదం ఇంకా కొనసాగడం రెండు దేశాలకే కాదు ఆగ్నేయాసియా ప్రాంతానికి కూడా మంచిది కాదు. అంతేకాదు అటు థాయిలాండ్ కానీ, ఇటు కంబోడియా కానీ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఈ రెండు దేశాలకు కూడా పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ప్రశాంత వాతావరణం ఉంటేనే విదేశీ పర్యాటకులు రావడానికి ఇష్టపడతారు. ఈ వాస్తవాన్ని రెండు దేశాలు కూడా గ్రహించినందునే తక్షణం కాల్పుల విరమణకు అంగీకరించాయని భావించాలి. అలాంటి విజ్ఞత సుదీర్ఘకాలంగా మారణకాండ కొనసాగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా, రష్యా ఉక్రెయిన్ వివాదాల విషయంలో కూడా నేతలకు కలగాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News