హైదరాబాద్: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమరులు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సాయుధ పోరాటం పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర తెలంగాణది అని ప్రశంసించారు. గన్‌పార్క్‌లో అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని, తెలంగాణ చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినమని, బానిసత్వ సంకెళ్లను తెంచడానికి అమరులైన వారికి నివాళులర్పిస్తున్నామని, నాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాపాలన సాధించుకున్నామని, కష్టమో, నష్టమో ప్రజలతో పంచుకుంటున్నామన్నారు.
ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదన్నారు. డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల కోసం తీసుకొచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయని, ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులకు మేలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల సంక్షేమం విషయం రాజీ పడడంలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?
సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడించామని, సివిల్స్ పరీక్షలు రాసేవారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని, గత ప్రభుత్వం ధరణితో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తీసుకొచ్చి సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే నిన్నటి నియంత పాలనను పక్కనపెట్టామన్నారు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి తమ పాలనలో తావులేదని, స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్ మోడల్‌గా ఉన్నామని రేవంత్ రెడ్డి తెలియజేశారు.