2022 నుంచి ఇప్పటివరకు జరగని సుదీర్ఘ సంపూర్ణ చంద్ర గ్రహణం ఈనెల 7,8 తేదీల్లో దేశం లోని అన్ని ప్రాంతాలకు కనువిందు చేయనుంది. 2018 జులై 27 తరువాత దేశం లోని అన్ని ప్రాంతాలకు సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్శించే అవకాశం రావడం ఇదే మొదటిసారి అని ఖగోళశాస్త్రవేత్తలు వెల్లడించారు. తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 31న జరుగుతుందని ఆస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) పబ్లిక్ అవుట్‌రీచ్ అండ్ ఎడ్యుకేషన్ కమిటీ ఛైర్ దివ్య ఒబెరాయ్ వెల్లడించారు. గ్రహణాలు అరుదుగా జరుగుతుంటాయి. ప్రతిసారి సంపూర్ణ గ్రహణం ఏర్పడదు. ఎందుకంటే సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూ కక్ష కు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుందని చెప్పారు. సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు దాని నీడ చంద్రునిపై పడి చంద్రగ్రహణం సంభవిస్తుందన్నారు. 7 వ తేదీ రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుందని చెప్పారు.
ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదని నేరుగా చూడవచ్చని సైన్స్, కమ్యూనికేషన్, పబ్లిక్ అవుట్ రీచ్, ఎడ్యుకేషన్ సెక్షన్ హెడ్ నీరజ్ మోహన్ రామానుజం వివరించారు. పాక్షిక గ్రహణం 7 వ తేదీ రాత్రి 9.57 నుంచి కనిపిస్తుందని, సంపూర్ణ గ్రహణం రాత్రి 11.01 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. 11.01 నుంచి 12.23 గంటల వరకు 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని, పాక్షిక గ్రహణం దశ రాత్రి 1.26 గంటలకు పూర్తవుతుందని, 8 వ తేదీ తెల్లవారు జామున 2.25 గంటలకు గ్రహణం వీడిపోతుందని వివరించారు. సింగిల్ వెబ్ పేజీ ద్వారా ఈ గ్రహణం ప్రత్యక్ష ప్రసారం ప్రజలు సందర్శించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. భారత దేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తుంటారు. ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్టశక్తి ఆవరిస్తుందన్న భయంతో ఎక్కడికీ వెళ్లరు. కొందరు గర్భిణులకు, పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదమని భావిస్తుంటారు.