Wednesday, May 28, 2025

అప్పుల భారంతో కుటుంబం సామూహిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రోడ్డుపక్కన ఆగిఉన్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మూకుమ్మడి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం హర్యానాలోని పంచకులలో కలకలం సృష్టించింది. బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చిన కుటుంబం అక్కడినుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 కోట్ల దాకా పెద్ద ఎత్తునఉన్న అప్పుల భారం కారణంగానే ఆ కుటుంబం ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు కథనం ప్రకారం.. సోమవారం రాత్రి ఓ కారు తన కారు వెనుక ఆగి ఉండడాన్ని గమనించిన ఓ వ్యక్తి దాని వద్దకు వెళ్లగా ఓ వ్యక్తి అక్కడి ఫుట్‌పాత్‌పై కూర్చుని ఉన్నాడు. కారు ఇక్కడ ఎందుకు పెట్టావని స్థానికుడు ఆ వ్యక్తిని ప్రశ్నించగా, తన పేరు ప్రవీణ్ అని, బాగేశ్వర్ ధామ్‌నుంచి తిరిగి వెళ్తున్నామని, రాత్రిపూట హోటల్ రూమ్ దొరక్క పోవడంతో అక్కడ ఆగినట్లు చెప్పాడు.

కారును వేరే చోటికి మార్చుకొమ్మని చెప్పడంతో అతను వెళ్తుండగా కారులో పలువురు అచేతన స్థితిలో పడి ఉండడం గమనించి నిలదీయగా తమ కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకున్నారని, తాను కూడా మరో అయిదు నిమిషాల్లో చనిపోతానని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆరుగురు చనిపోగా, చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పంచకుల డిసిసి హిమాద్రి కౌశిక్ మాట్లాడుతూ మృతులను డెహ్రాడూన్‌కు చెందిన ప్రవీణ్ మిట్టల్, అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిగా గుర్తించినట్లు చెప్పారు. కుటుంబం మొత్తం విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కారునుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని, కుటుంబానికి పెద్ద మొత్తంలో అప్పులు,

తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఆ్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో ఉందని డిసిపి తెలిపారు. ప్రవీణ్ మిట్టల్ స్వస్థలం హిసార్ లోని బార్వాలా. అయితే గత రెండేళ్లుగా అతను పంచకులలోని సాకేత్రి ప్రాంతంలో ఉంటూ టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రవీణ్ కొన్నేళ్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లో స్క్రాప్ ఫ్యాక్టరీ నిర్వహించాడు. అయితే అప్పులు భారీగా పెరగడంతో బ్యాంకులు ఆ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి. ప్రవీణ్ కుటుంబానికి దాదాపు 20కోట్ల దాకా అప్పులు ఉన్నట్లు కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News