రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల కట్టడంలోని పాక్షిక భాగం శుక్రవారం కూలిపోవడంతో ఉదయపు ప్రార్థనకు హాజరైన ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు, మరి 28 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాఠశాల కాంక్రీటు శ్లాబ్, ఇటుకలు, రాళ్లు కుప్పకూలాయి. శిథిలాల నుంచి విద్యార్థులను కాపాడే యత్నంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సాయపడ్డారు. పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయిన సమాచారం తమకు ఉదయం 7.45కు అందిందని పోలీసు అధికారులు తెలిపారు. ‘ఇప్పటి వరకైతే ఏడుగురు చనిపోయారు’ అని మనోహర్‌ఠాణ పోలీస్ స్టేషన్ అధికారి నంద్ కిశోర్ వర్మ తెలిపారు. ఇక గాయపడిన విద్యార్థులను ఝలావర్ హాస్పిటల్, మనోహర్‌ఠాణ హెల్త్ సెంటర్‌లకు తీసుకెళ్లారని సమాచారం.
చనిపోయిన విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తన సంతాప సందేశంలో ‘దేవుడు చనిపోయిన దివ్యాత్మలకు తన పాదపద్మములలో స్థానం ప్రసాదించుగాక, ఈ అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని వారి కుటుంబానికి ప్రసాదించుగాక’ అని పేర్కొన్నారు. గవర్నర్ హరిభావు బగాడే, అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్‌నాని, ప్రతిపక్ష నాయకుడు తికారాం జుల్లీ, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, వసుంధర రాజే, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్, పిసిసి చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా, మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా, ఇతర నాయకులు కూడా తమ సంతాపాన్ని తెలిపారు.