పాక్ ఆగడాలు ఆగడం లేదు. ఏదో రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పంజాబ్ లోని అమృత్‌సర్ సమీపంలో భారత్ పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలను , మత్తు పదార్ధాలను మనదేశం లోకి పంపేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నింది. దానిని భగ్నం చేసిన భారత సరిహద్దు దళం (బిఎస్‌ఎఫ్) … ఆరు డ్రోన్లను కుప్పకూలింది. మూడు తుపాకీలు, మేగజైన్లతోపాటు కేజీ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్ అధికారులు మీడియాకు వెల్లడించారు. బుధవారం రాత్రి అనుమానాస్పద వస్తువులు భారత్ భూభాగం లోకి వస్తున్నట్టు
గుర్తించిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాక్‌కు చెందిన డ్రోన్లు దూసుకొస్తున్నట్టు గుర్తించి కౌంటర్ ఆపరేషన్ చేపట్టారు. మోథే సమీపంలో 5 డ్రోన్లను నేల కూల్చారు. మూడు తుపాకులు, మూడు మ్యాగజైన్లు, దాదాపు 1.07 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గురువారం తెల్లవారు జామున అట్టారీ దాల్ గ్రామానికి సమీపంలో మరో డ్రోన్‌ను కూల్చివేసినట్టు తెలిపారు. వీటితోపాటు దాల్ సమీపం లోని పంటపొలాల్లో తుపాకీ విడిభాగాలు, ఓ మ్యాగజైన్ గుర్తించినట్టు బీఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించాయి.