బెంగళూరు: ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో 9వ తరగతి విద్యార్థిని బాత్రూమ్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లా షాహపూర్ ప్రాంతంలో జరిగింది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, హాస్టల్ వార్డెన్, సైన్స్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. 17 ఏళ్ల విద్యార్థిని గర్భధారణను పూర్తి చేసుకొని పండంటి బిడ్డను జన్మించే వరకు ఎవరకి తెలియకపోవడంతో జిల్లా శిశు సంరక్షణ అధికారి నిర్మల మండిపడుతున్నారు. షాహపూర్ పోలీస్ స్టేషన్లో నిర్మల ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ప్రతి నెల వైద్యులు హెల్త్ చెకప్ లు చేయడంలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సిబ్బంది ఈ విషయం బయటకు పొక్కకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. పాఠశాల నిర్వాహకులు తప్పనిసరిగా చేయాల్సిన ఆరోగ్య తనిఖీలు చేపట్టలేదని కమిషన్ సభ్యుడు శశిధర్ కోసంబే పేర్కొన్నారు. హాస్టల్లో ఉన్న బాలికల కోసం నెలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయాల్సిందేనని, నర్సును కూడా నియమించాల్సిందని, ఈ పాఠశాలలో అలాంటి విధానమూ పాటించలేదని ఆయన చెప్పారు. విద్యార్థిని, శిశువు ఆరోగ్యంగా ఉన్నారని వారిని ప్రభుత్వ ఆసుపత్రితో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కమిషన్ జిల్లా బాలల సంరక్షణ అధికారి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, పాఠశాల అధికారులపై కేసు నమోదు చేయడంతో పాటు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా సామాజిక సంక్షేమ శాఖ సూచించింది.
Also Read: ట్రంప్ వినాయక చవితి కానుక