చైనాలోని తియాన్జిన్లో జరిగిన షాంఘై సహకార సదస్సు ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ సదస్సు ఫోటోలు వెల్లువలా వైరల్ అయ్యాయి. అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి సందేశం పంపడమే ఈ సదస్సు లక్షం. కానీ ఈ ప్రతీకవాదానికి అతీతంగా భారత దేశానికి సంబంధించి ఏదైనా నిజమైన ప్రాముఖ్యతను కలిగి ఉందా? భారతదేశం తన లక్షాలను ఏవైనా సదస్సులో ప్రస్తావించగలిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు చాలా తక్కువగా పాల్గొనే సదస్సుల్లో షాంఘై ఒకటి. అమెరికా టారిఫ్‌ల షాక్‌కు గురవుతున్న భారత్‌కు ఈ పరిస్థితుల్లో అనుకూల ప్రత్యామ్నాయ అవకాశం చైనా అనిపించింది.
చైనా ఆతిథ్యంలో షాంఘై సదస్సులో భారత్ అమితాసక్తితో పాల్గొనడం భారత్‌కు ఇతర అవకాశాలు ఉన్నాయని అమెరికాకు గట్టి సందేశం ఇచ్చినట్టయింది. భారత దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి పర్యాయ వేదికలుగా షాంఘై, బ్రిక్స్ సదస్సులు ఉంటున్నాయి. కొంతమందికి అవి భారత సార్వభౌమత్యాన్ని, ఆత్మాభిమానాన్ని నొక్కి చెబుతాయి. భారత దేశం రష్యా, చైనా వంటి గొప్పశక్తుల వైపు మొగ్గు చూపుతోందనే సందేశం అందిస్తోంది. భారత్ భౌగోళిక రాజకీయ, ఆర్థిక భవిష్యత్ అవసరాల దృష్టా షాంఘై సదస్సు ప్రయోజనాన్ని ప్రశ్నించడానికి ఇదే సరైన సమయం. షాంఘై సదస్సు యురేసియా దేశాల కూటమి. ఇందులో రష్యా, చైనా, ఇరాన్, మధ్య ఆసియా దేశాల భాగస్వామ్యం ఉంటోంది.
ఈ కూటమిలో భారత్, పాక్ కూడా ఉన్నాయి. భారత్ వలె కాకుండా ఈ దేశాలన్నీ అప్రజాస్వామికమైనవి. మానవ హక్కులపై ప్రశ్నించే రికార్డు వీటికి ఉంది. ఇవి తమ విదేశీ విధానంలో పశ్చిమదేశాలపై వ్యతిరేకత ప్రతిబింబిస్తుంది. పశ్చిమదేశాలపై ఇవి తిరుగుబాటు సభ్యదేశాలుగా ప్రచారం పొందాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఈ మూడు దేశాలను మరింత సన్నిహితం చేశాయి. భారత్ మాత్రం పశ్చిమదేశాలకు వ్యతిరేకం కాదు కానీ, పశ్చిమేతర దేశం. ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి భారత్ చాలా కష్టపడుతోంది. అయితే షాంఘై సదస్సు తన వైఖరిలో పశ్చిమదేశాలపై వ్యతిరేకతను స్పష్టంగా చూపిస్తోంది. ప్రపంచ దేశాల వ్యవహారాల్లో అమెరికా ఆధిపత్యం పెరిగిపోతున్న కాలం లోనే ఈ షాంఘై సదస్సు ఆవిర్భవించింది.
అమెరికా విధానంలో మార్పులపై భారత్ ఆందోళన చెందుతున్నప్పటికీ, టెహ్రాన్, మాస్కో, బీజింగ్ దేశాల వారితో భారత్ సహజంగా పొత్తు పెట్టుకోలేదు. చైనా తప్ప ఈ దేశాలేవీ భారత్‌కు ప్రధాన ఆర్థిక భాగస్వాములు కావు. 2022లో ఉక్రెయిన్‌పై దాడి తరువాత రష్యా ఒక్కటే భారత్‌కు మిత్రదేశంగా నిలిచింది. భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా రష్యా నుంచి మనం చమురు తీసుకుంటున్నా మొత్తం వాణిజ్యం గణాంకాలు చాలా సూక్ష్మమైనవే. యురేసియన్ ఎకనామిక్ యూనియన్‌లో భారత ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ బ్రిటన్, దక్షిణ కొరియా, వంటి ప్రధాన ఆర్థిక దేశాల స్వేచ్ఛా వాణిజ్యంతో సరిపోల్చలేం. అందువల్ల షాంఘై సహకార సదస్సు వినియోగం ఆర్థిక రంగంలో పరిమితమే. ఇది ప్రధానంగా రాజకీయ భద్రతా కూటమిగా కొనసాగుతుంది.
ఆ కోణంలో చూసినా భారత్ ఏం పొందగలుగుతుంది? భద్రతాపరంగా చైనా, పాకిస్తాన్ దేశాల నుంచే సవాళ్లను భారత్ ఎదుర్కొంటోంది. ఈ దేశాల సవాళ్లలో ఏదైనా పరిష్కరించడానికి షాంఘై సదస్సు సహకరిస్తుందా? అన్నది ప్రశ్నార్థకం. తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రతిష్టంభన లేదా ఆపరేషన్ సిందూర్‌లో కానీ చైనా నుంచి భారత్‌కు మద్దతు లేదా సానుభూతి ఏదీ లభించడం లేదు. ప్రస్తుతం భారత్ చైనా సంబంధాలు మళ్లీ పెనవేసుకుంటున్నప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగా తమ విధానాలను అనుసరించడమే చైనా, పాకిస్థాన్ లక్షాలుగా గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. షాంఘై సదస్సు నుంచి పహల్గాం ఉగ్రదాడిపై నిరసన ప్రకటన వెలువడినప్పటికీ, అలాంటి సంయుక్త ప్రకటన పాకిస్థాన్ లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి విషయంలోనూ వెలువడిన విషయం గుర్తుంచుకోవాలి.
అందువల్ల పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ షాంఘై సదస్సులో ప్రతీకాత్మక ప్రస్తావన ఒక స్వల్ప ఎత్తుగడ మాత్రమే. ఈ సదస్సు రాజకీయంగా భారీ సంకేతాలు అందించినా, అసలు వాస్తవ విషయాల ప్రస్తావన మాత్రం కంటితుడుపుగా మిగిలాయి. పశ్చిమ దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టడం, సాంకేతిక సహకారం పొందడం, వాణిజ్యాభివృద్ధి ఇవే భారతదేశ పరివర్తనకు కీలకం. ఇవి సాధించాలంటే అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలు పెంపొందించుకోవడం తప్పనిసరి. ఈ దేశాలతో షాంఘై సదస్సు సభ్యదేశాలకు పోలిక ఏమాత్రం లేదు. టారిఫ్‌ల అస్తవ్యవస్త ప్రపంచంలో భారత్ ఐరోపా యూనియన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య బంధాలను వేగంగా పెంపొందించుకోవడమే ప్రత్యామ్నాయం.
అలాగే ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక మైత్రీ బంధాలు పటిష్టం కావలసి ఉంది. చైనాపాకిస్థాన్ సంబంధాలు మరింత గాఢంగా బలపడడం, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో పాకిస్థాన్‌కు చోటు కల్పించడం భారత్‌కు మంచి పరిణామాలు కావు. అయినప్పటికీ అమెరికా నుంచి భారత్ దూరం కావాలనుకోవడం సరైన వ్యూహం కాదు. అలాగే భారత్ ఎదుర్కొంటున భౌగోళిక రాజకీయ, ఆర్థిక సమస్యల విషయంలో షాంఘై సదస్సు ఉపయోగపడుతుందని భావించడం ఎండమావి వంటిది. కానీ షాంఘై సదస్సులో పాల్గొనడానికి చైనా వెళ్లడం ఉత్పాదక ప్రయోజనం కలిగించిందని భారత ప్రధాని మోడీ అభివర్ణిస్తున్నారు. కానీ మోడీ పర్యటన కొన్ని అవకాశాలను కోల్పోయిందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.
Also Read : ఉపపోరు ఖాయం