Monday, August 11, 2025

నల్లరేగడి మట్టి

- Advertisement -
- Advertisement -

అప్పుడుమా అవ్వ
చెట్టునుండి రాలడానికి సిద్ధంగా ఉన్న
ఎండు కొమ్మలా ఉండేది
జీవితంలోగట్టిగా పాతుకున్న అనుభవం
మాటల్లో బాగా ధ్వనించేది

ఫ్లాష్ బ్యాక్‌లో
ఆమె పైరు (She pie) కోసిన కొడవలి
పేళ్లు పగలేసిన గొడ్డలి
మొన్న రాలి పడే దాకా
పనిగా పూస్తూనే ఉంది

ఇప్పటికీ మా ఇంటి చుట్టూ
ఆమె ప్రేమగా పెంచిన నీడలు
ఎన్నో చీకటి రాత్రుల్లోనా
భయాన్ని భయపెట్టిన
వెలుతురు పాట ఆమె
ఎన్నో వెన్నెల రాత్రుల్లో
భూమ్యాకాశాల మధ్య
నన్ను ఎక్కించి దించిన నిచ్చెన ఆమె

ఆమె ఒళ్ళంతా నల్లరేగడి మట్టి వాసన
నా కోసం అలా చిటికెలు వేసి
ఇలా చినుకులు కురిపించేది
చేయి చేయి కలిపి
బతుకుమాల ఎలా అల్లుకోవాలో నేర్పింది
ఆమె కోప్పడ్డప్పుడు స్తంభించిన మబ్బుల్ని
ఉల్లాసంగా ఉన్నప్పుడు
పూసిన పువ్వుల్ని చూసాను
సిరిని, శరీరాన్ని ప్రేమించడం
మంచిది కాదని
చిలక్కు చెప్పినట్టు చెప్పేది
బతికినంత కాలం ఎలా బతకాలో చూపి
సాదా సీదాగా వెళ్ళిపోయింది

ఆమె వేసిన చెట్టు మాత్రం
ఇంకా జీవించడం ఎలానో నేర్పుతూ ఉంది

  • డాక్టర్ సుంకర గోపాల్
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News