త్వరలో తలసానికి నోటీసులు?
ఓఎస్‌డి ఇంట్లో లభించిన ఆధారాలు
రూ. 253 కోట్ల కుంభకోణంగా తేల్చిన కాగ్
ఇడి విచారణలో రూ.వెయ్యికోట్లుగా తేలింది
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన భారీ కుంభకోణం కొత్త మలుపు తిరగబోతోంది. ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో ఆ శాఖ అధికారులు, ఉద్యోగుల వరకే పరిమితం అయిన దర్యాప్తు, ఇక నుంచి అప్పట్లో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పై దృష్టి సారించబోతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలో ఆయనకు ఇడి నోటీసు జారీ చేయబోతున్నట్టు తెలిసింది. మొదట ఈ కుంభకోణం రూ.253 కోట్లుగా ‘కాగ్‘ తేల్చగా, దీనిపై తీగలాగితే అది వెయ్యికోట్లపైగానేఉన్నట్టు తేలిందని ఇడి అధికారికంగా ప్రకటించింది.
దీంతో ఈ భారీ కుంభకోణం వెనుక బడాబాబు పాత్రపై నిగ్గుతేల్చేందుకు ఇడి అధికారులు రంగం సిద్ధం చేస్తోన్నట్టు ఈ వర్గాల సమాచారం. ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ పాత్రపై ఇడి ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అప్పట్లో మంత్రి వద్ద ఓఎస్‌డిగా పనిచేసిన కళ్యాణ్ నివాసంలో ఇడి నిర్వహించిన తనఖీలలో కీలకమైన ఆధారాలు లభించినట్టు ఈ వర్గాల సమాచారం. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా ఓఎస్‌డి రూ.వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడుతారా? అని ఇడి అనుమానానికి తనఖీలలో లభించిన సాక్షాధారాలు బలం చేకూర్చినట్టు తెలిసింది. దీంతో ఇడి అధికారులు త్వరలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు నోటిసులు జారీ చేసి విచారణకు పిలువబోతున్నట్టు తెలిసింది.