పాశమైలారం సిగాచి పరిశ్రమ వద్ద హృదయ
విదారక దృశ్యాలు 40కి చేరిన మృతుల
సంఖ్య ఇంకా ఆచూకీ దొరకని 11మంది
శిథిలాల నుంచి మరో రెండు మృతదేహాల వెలికితీత
క్షతగాత్రుల్లో మరో ఐదుగురి పరిస్థితి విషమం
ప్రమాదఘటనపై నిగ్గుతేల్చేందుకు నిపుణుల
కమిటీ కట్టలు తెంచుకున్న బాధితుల ఆగ్రహం
మంత్రి దామోదర రాజనరసింహ వాహనాన్ని
అడ్డుకున్న బాధితులు
మా వాళ్లను చూపించండి..
లేదా మృతదేహాలనైనా అప్పగించండి
* ‘పాశమైలారం’ బాధిత కుటుంబాల ఆక్రోశం
* ఆకలిదప్పులు మరిచి ఫ్యాక్టరీ వద్ద పడిగాపులు
*కంపెనీ వైస్ చైర్మన్, మంత్రి రాజనర్సింహ కార్ల అడ్డగింత సర్దిచెప్పిన ఆరోగ్య మంత్రి
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: ‘మా వాళ్లు ఎక్కడున్నారు… ఇంకా ఎన్నిరోజులు తిరగాలి…ఎంతమందిని కలవాలి’ అంటూ పాశమైలారం లోని సిచాచీ కంపెనీ బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. వారి కన్నీళ్ల మాటున దాగి ఉన్న ఆగ్రహం కట్టలు తెగుతోంది. ఓపిక నశించిపోతోంది. ‘మా వాళ్లనైనా చూపండి…శవాలనైనా ఇవ్వండి’ అని ఆవేదనాభరితంగా అడుగుతున్నారు. ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు అనంతర పరిణామాలు అనేక కుటుంబాల్లో కల్లోలాన్ని నింపింది. రక్తం, ఇతర నమూనాలు ఇచ్చినప్పటికీ తమ వారి ఆచూకీ గురించి చెప్పడం లేదన్నది బాధితుల ఆవేదన. అంతేకాకుండా తమను కంపెనీ లోపలికి వెళ్లనివ్వడం లేదన్నది ఆక్రందన.
పోలీస్‌లు అడ్డుకోవడంతో తమ బాధను వెళ్లగక్కేందుకు బాధితులకు వేరే దారి కనిపించడం లేదు. బుధవారం తొలుత కంపెనీ వైస్ ఛైర్మన్ చిదంబరనాథన్‌ను బాధితులు అడ్డుకున్నారు. అయన నచ్చజెప్పడం, పోలీస్‌లు సర్దిజెప్పడంతో బాధితులు పక్కకు జరిగారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వాహనానికి అడ్డుపడ్డారు. మూడు రోజులుగా మంత్రి స్వయం గా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులతో నేరుగా మాట్లా డి, వారికి నచ్చజెపుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ, వారి వైద్యాన్ని తెలుసుకుంటున్నారు. తానే ఒక నోట్‌బుక్ పెట్టుకుని, దానిలో రాసుకుంటూ, తక్షణ సాయాన్ని అక్కడికక్కడే బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ద్వారా అందజేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పలు దఫాలుగా మంత్రి కంపెనీ వద్దకు వెళ్తున్నారు. ఇంకా సహాయక చర్యల గురించి అధికారులతో చర్చిస్తున్నారు. అటు సిఎంకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. అయినప్పటికీ తమ వారి ఆచూకీ లేకపోవడంతో ఫ్యాక్టరీ వద్ద బాధితులు మంత్రిని అడ్డగించారు. మరోసారి ఆయన బాధితులకు సర్దిజెప్పారు.
సాయంత్రం సమయంలో బాధితులు మరోసారి ఆగ్రహం వెళ్లగక్కారు. తమ వారెక్కడ? అని ప్రశ్నించారు. కంపెనీ వద్ద ధర్నాకు దిగారు. ఇక ఆస్పత్రిలో కూడా బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమ వారి కోసం ఆరాటపడుతున్నారు. జిల్లా, రాష్ట్ర యం త్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసినప్పటికీ ఆచూకీ లేని 16 మంది వ్యక్తుల విషయంలో…సమాధానం లభించడం లేదు. అధికారులకు కూడా ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమేనని వెతుకుతున్నాయి. తమకు ప్రమాదం పొంచి ఉన్నా…తగిన జాగ్రత్తలతో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు జల్లెడ పడుతున్నాయి. శిథిలాల నుంచి కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు దొరికే అవకాశం ఉండడంతో, సిబ్బందికి తగిన పాలిథిన్ బ్యాగులను ఇచ్చి పంపుతున్నారు. అయినా..అయిన వారి జాడ కోసం…బాధితుల ఎదురుచూపులు..కనీసం అవయవాలైనా దొరుకుతాయేమోనని యంత్రాం గం వెతుకులాట.
కంట్రోల్ రూం ఏర్పాటుబాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని డిఆర్‌ఓ పద్మజారాణి తెలిపారు. ఎవరైనా 08455276155 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. మంళవారం ఈ నెంబర్‌కు 26 ఫోన్‌కాల్స్, బుధవారం 30 వరకు ఫోన్‌లు వచ్చాయని అన్నారు. క్షతగాత్రుల వివరాలను ఫోన్ చేసిన అడిన వారికి అందించామని చెప్పారు.