మహారాష్ట్రలో అథికార షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ హాస్టల్ క్యాంటిన్ ఉద్యోగిపై దౌర్జన్యానికి దిగాడు. ముంబైలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. క్యాంటిన్‌కు వచ్చిన తనకు సర్వర్ ముక్కిపోయిన ఆహారం పెట్టాడనే కోపంతో ఎమ్మెల్యే దురుసుగా క్యాంటిన్ మేనేజర్ చెంప చెళ్లుమన్పించాడు. సంబంధిత వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తింది. ఈ ఘటనను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. అయితే తాను చేసింది సబబే అని ఈ బుల్థానా ఎమ్మెల్యే గైక్వాడ్ సమర్థించుకున్నారు. ఇది శివసేన స్టయిల్ అన్నారు. ఇంతకు ముందు కూడా ఆహారం సరిగ్గా లేదని చెప్పానని, అయినా పట్టించుకోలేదని, అందుకే తగు విధంగా బుద్ధి చెప్పేందుకు చెంపదెబ్బ తీశానని చెప్పారు. తన పనికి తాను చింతించడం లేదని, క్షమాపణ అవసరం లేదన్నారు ఇక్కడి ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్‌లో జరిగిన ఎమ్మెల్యే జులం ఘటన వివరాలు వీడియోగా వెలుగులోకి వచ్చాయి.
బిల్ కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తికి బిల్లు చెల్లించకుండా , ఆయనను పట్టుకుని పదేపదే కొట్టినట్లు, దీనితో ఈ వ్యక్తి కిందపడిపోయినట్లు స్పష్టం అయింది. ఈ ఎమ్మెల్యే ఇంతకు ముందు కూడా ఇటువంటి దౌర్జన్యకర చర్యలకు అలవాటుపడ్డాడు. తాను చేసింది సబబే అని గైక్వాడ్ బుధవారం విలేకరుల సమావేశం పెట్టి తెలిపారు. ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటిన్‌కు రోజూ వందలాది మంది వస్తుంటారని, తిండి సరిగ్గా ఉండటం లేదని తాను ఎన్నిసార్లు పిర్యాదు చేసినా , కాంట్రాక్టరు పట్టించుకోవడం లేదని , తగు విధంగా బుద్ధి చెప్పేందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందన్నారు.చెపితే వినకపోతే , చెంపచెళ్లు మన్పించాల్సిందే, ఇది తమ ఫక్కా శివసేన జోరు అని ఈ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాను వెనక్కు తగ్గేదే లేదన్నారు. గత 30 ఏండ్లుగా తిష్టవేసుకుని ఉన్న కాంట్రాక్టరు ఈ విధంగా పాడైపోయిన తిండి పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే కుదరదనే ఈ విధంగా బుద్ధి చెప్పానని స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యే అధినాయకుడు , ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఘటనపై స్పందించారు. ఏదో తప్పు జరిగింది.
చట్టప్రకారం చర్య ఉంటుంది. ఏది ఏమైనా కొట్టడం తప్పన్నారు. ఘటనపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఇటువంటి దురుసు ప్రవర్తన ఎవరికైనా మంచిది కాదు. ఇటువంటి దౌర్జన్యంతో ఎమ్మెల్యేతో పాటు మొత్తం సభ పరువు పోతుందని చెప్పారు. శివసేన యుబిటి ఈ వ్యవహారాన్ని మండలిలో ప్రస్తావించింది. అధికార పక్షం ఆగడాలకు అంతులేకుండా పోతోందని విమర్శించారు. గైక్వాడ్ వైఖరిని శివసేన యుబిటి ఎంపి ప్రియాంక చతుర్వేది ఖండించారు. ఈ ఎమ్మెల్యేకు నోటి దురుసు ఎక్కువ. గత ఏడాది ఆయనే రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ 11 లక్షలు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు సంజయ్ గైక్వాడ్ నిస్సహాయుడైన క్యాంటిన్ ఉద్యోగిపై చేయిచేసుకున్నాడని, ఈ దౌర్జన్యకాండ టీవీలలో రాకుండా చూసుకున్నారని చతుర్వేది విమర్శించారు. గత ఏడాది ఇదే ఎమ్మెల్యే ఓ యువకుడిని కర్రతో చితకబాదిన ఘటన కూడా కలకలానికి దారితీసింది. ఇటువంటి ఆగడాలు ఎక్కువగా అధికార పక్షం వైఖరికి అద్దం పడుతాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఉభయసభలలో తమ నిరసనను తీవ్రతరం చేశాయి.