మా ప్రాజెక్టులను అడ్డుకోకండి
మీరు బాధ్యతగా ఉండండి…మమ్మల్ని బతకనివ్వండి
మీరు సహకరించకపోతే.. పోరాటం ఎలా చేయాలో మాకు తెలుసు
ఎపి సిఎం బాబునుద్దేశించి రేవంత్ వ్యాఖ్యలు
కృష్ణా నది ద్వారా రోజుకు 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలమూరు ప్రజల పట్ల ఉదారతను చాటాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. రాయలసీమ లిఫ్టుతో పాలమూరు ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.
చంద్రబాబు నాయుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకంతో పాటు కెఎల్‌ఐ, ఎస్‌ఎల్‌బిసి, కోయిల్ సాగర్ వంటి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టును అడ్డుకోవద్దని, మీరు బాధ్యతగా ఉండి ఈ ప్రాంత ప్రజలను బతకనివ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. రాయలసీమ లిఫ్టును రద్దు చేయాలని విఙ్ఞప్తి చేస్తున్నామని మా ప్రాజెక్టులకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే పోరాటాలు ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు బాగా తెలుసన్నారు. పాలమూరు ప్రజలకు నష్టం జరిగే చర్యలకు పూనుకుంటే మా పౌరుషం ఏమిటో చూపిస్తామన్నారు.