పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ప్రదర్శనే చేస్తున్నప్పటికీ.. టీం ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) ఆసియాకప్-2025లో ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే శ్రేయస్‌కు ఊరటనిస్తూ.. త్వరలో ఆస్ట్రేలియా ఎతో తలపడే ఇండియా ఎ జట్టుకు అతన్ని కెప్టెన్‌గా నియమించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయస్ తనకు జరిగిన ఓ బాధాకరమైన సంఘటన గురించి పంచుకున్నాడు. 2023లో తనకు వెన్నునొప్పి సమస్య వచ్చిందని.. ఆ సమయంలో అతను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనని తెలిపాడు.
‘‘ఆ సమయంలో నేను ఎంతో నొప్పితో బాధపడ్డాను. ఆ బాధ ఎవరికీ తెలియదు. ఓ కాలికి పక్షవాతం వచ్చింది. వెన్నుముకకు సర్జరీ జరిగిన తర్వాత.. నడుములో రాడ్‌తో ఇప్పటికీ నెట్టుకొస్తున్నా. కానీ, సయాటికా నెర్వ్ తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అదెంతో ప్రమాదకరమని వైద్యులు చెప్పారు. నా పాదం చిటికెన వేలు వరకూ నొప్పి వ్యాపించింది. నా కెరీర్ ముగిసిపోయిందేమో అనుకున్నా. ఆ తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాను కూడా.. ఈ విషయాలు బయట ప్రజలకు అర్థం కావు. వాళ్లు అథ్లెట్లను రోబోలుగా చూస్తారు. ప్రతీ మ్యాచ్‌లోనూ గొప్ప ప్రదర్శన చేయాలని కోరుకుంటారు. దాని వెనుక ఎంత కష్టముందో అనుభవిస్తేనే తెలుస్తుంది’’ అని శ్రేయస్ (Shreyas Iyer) చెప్పాడు.
ఆసియా కప్‌కు ఎంపిక కాకపోవడంపై శ్రేయస్ స్పందిస్తూ.. ‘‘నా నియంత్రణలో ఉన్నవాటి గురించే నేను ఆలోచిస్తాను. నా నైపుణ్యాలు, బలాలను మరింత మెరుగుపరుచుకుంటూనే ఉంటాను. అవకాశం వచ్చినప్పుడు దాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంటాను’’ అని అన్నాడు.
Also Read : టి-20 సిరీస్‌కి ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్